Balakrishna: బాలకృష్ణకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
- Author : Vamsi Chowdary Korata
Date : 26-03-2026 - 9:52 IST
Published By : Hashtagu Telugu Desk
Nandamuri Balakrishna ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. దిల్లీ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. దిల్లీ సీఎం రేఖా గుప్తా చేతుల మీదుగా బాలకృష్ణ ఈ అవార్డును స్వీకరించారు. వెటరన్ నటి షర్మిలా ఠాగూర్, దివంగత నటుడు ధర్మేంద్రను సైతం లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు.
భారతీయ చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. బుధవారం సాయంత్రం దేశ రాజధానిలో ఘనంగా ప్రారంభమైన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ దిల్లీ (IFFD) 2026’ వేడుకల్లో ఆయనకు ప్రతిష్టాత్మక ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ (జీవితకాల సాఫల్య) పురస్కారాన్ని అందజేశారు. దశాబ్దాలుగా సినిమా రంగానికి ఆయన చేసిన విశేష కృషిని గుర్తిస్తూ నిర్వాహకులు ఈ అవార్డుతో సత్కరించారు.
దిల్లీలోని ‘భారత్ మండపం’ ఈ మెగా ఈవెంట్‌కు వేదికైంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు మంత్రులు కపిల్ మిశ్రా, పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, నటీమణులు హేమమాలిని, కంగనా రనౌత్, షర్మిలా ఠాగూర్‌లు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించారు. ఈ వేడుకల్లో బాలకృష్ణతో పాటు ప్రముఖ అలనాటి నటి షర్మిలా ఠాగూర్, దివంగత లెజెండరీ నటుడు ధర్మేంద్ర (ఆయన తరఫున కుటుంబసభ్యులు)ను కూడా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో గౌరవించారు. ముఖ్యమంత్రి రేఖాగుప్తా చేతుల మీదుగా వీరంతా అవార్డులు అందుకున్నారు.
ఈ సందర్భంగా షర్మిలా ఠాగూర్ మాట్లాడుతూ.. వయసు పెరిగేకొద్దీ నటనలో మరింత స్వేచ్ఛ లభిస్తుందన్నారు. దిల్లీ పర్యాటక, రవాణా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చలనచిత్ర ఉత్సవాలు మార్చి 31 వరకు కొనసాగనున్నాయి. వివిధ భాషా చిత్రాలను ఈ వేడుకలో ప్రదర్శించనున్నారు.