Happy Birthday Megastar : వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్..!
ఒక సాధారణ కానిస్టేబుల్ తనయుడిగా పరిశ్రమలోకి అడుగు పెట్టిన శివ శంకర వరప్రసాద్ అనే అతను
- Author : Ramesh
Date : 22-08-2024 - 8:09 IST
Published By : Hashtagu Telugu Desk
Happy Birthday Megastar మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినిమా చరిత్రలో ఈ పేరుకి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ప్రాణం ఖరీదు సినిమాతో వెండితెరకు పరిచయమైన చిరంజీవి అంచెలంచెలుగా ఎదుగుతూ అగ్రస్థాయికి చేరుకున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్ టీ ఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు ల తర్వాత స్టార్ స్టేటస్ తెచ్చుకున్న హీరో చిరంజీవి. ఒక సాధారణ కానిస్టేబుల్ తనయుడిగా పరిశ్రమలోకి అడుగు పెట్టిన శివ శంకర వరప్రసాద్ అనే అతను చిరంజీవిగా మారి తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో అద్భుతమైన సినిమాలు అందించారు.
అప్పటి యూత్ కి చిరంజీవి అంటే ఒక పిచ్చి. ఇప్పటితరం హీరోలే కాదు చాలా మంది నటీనటులు చిరంజీవిని చూసే నేను సినిమాల్లోకి వెళ్తా చిరంజీవిని అవుతా అని అంటూ వచ్చారు. ఈ తరం ఎంతోమంది స్టార్స్ కు చిరంజీవి స్పూర్తి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నవరసాలను పండించడంలో తన సత్తా చాటుతూ మాస్ ఆడియన్స్ కు మెగా మేనియా ట్రీట్ ఇస్తూ మెగా బాస్ (Mega Boss) హంగామా అంతా ఇంతా కాదు.
దాదాపు 45 ఏళ్ల సినీ కెరీర్ లో చిరంజీవి అందుకోని అవార్డు రివార్డ్ లేవని చెప్పొచ్చు. తెలుగు సినిమా హీరోగా అత్యధిక పారితోషికం అందుకున్న హీరో చిరునే. ఆయన సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. ఎన్నో సినిమాలు చరిత్రలో నిలిచిపోయాయి. సాహసమే ఊపిరిగా ఫ్యాన్స్ కి మంచి సినిమా అందించడం కోసం మెగాస్టార్ చేసిన కృషి అంతా ఇంతా కాదు. స్వయంకృషి (Swayamkrushi)తో స్టార్ గా ఎదిగిన ఆయన ఎంతోమందికి ఆదర్శప్రాయుడు.
చిరంజీవి గురించి కొన్ని మాటల్లో.. కొన్ని రాతల్లో చెప్పడం కష్టం. ఆయన ఒక శిఖరం.. మెగాస్టార్ అనేది తెలుగు సినీ ప్రేమికులకు ఒక ఎమోషన్. 65 ప్లస్ ఏజ్ ఉన్నా ఇప్పటికీ ఫ్యాన్స్ కి తన మార్క్ సినిమాలను అందించాలనే తపన పడే చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా తో రాబోతున్నాడు. చిరంజీవి అంటే కేవలం మెగా ఫ్యాన్స్ కే కాదు తెలుగు సినిమాలను ఇష్టపడే అందరికీ కూడా ఆయన మెగాస్టారే.. అందుకే కేవలం టాలీవుడ్ లోనే కాదు వరల్డ్ వైడ్ గా కూడా వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ (One and Only Megastar) ఆయన.. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి గారికి హ్యాష్టాగ్ యు తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్నాం.