Vishal : విశాల్ ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబర్స్ పై కేసు నమోదు..
కొంతమంది తమిళ యూట్యూబర్స్ మాత్రం విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు ప్రచారం చేసారు.
- By News Desk Published Date - 11:28 AM, Sat - 25 January 25

Vishal : తమిళ్ స్టార్ హీరో విశాల్ తమిళ్ తో పాటు తన సినిమాలతో తెలుగు వాళ్లకు కూడా దగ్గరయ్యాడు. తెలుగు వాడైనా అక్కడ సెటిల్ అయి తమిళ్ లో స్టార్ గా ఎదిగాడు విశాల్. ఇటీవలే సంక్రాంతికి మదగజరాజ అనే సినిమాతో వచ్చి తమిళ్ లో హిట్ కొట్టాడు. 12 ఏళ్ళ క్రితం రిలీజవ్వల్సిన ఈ సినిమా ఈ సంక్రాంతికి రిలీజయి హిట్ కొట్టింది.
అయితే ఇటీవల మదగజరాజ సినిమా ప్రమోషన్స్ లో ఓ ఈవెంట్లో విశాల్ మాట్లాడుతుండగా అతని చేతులు వణకడం, విశాల్ బక్కగా అవ్వడం, విశాల్ ఫేస్ లో కూడా బలహీనంగా ఉన్నట్టు కనిపించడంతో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో విశాల్ కి ఏమైంది అంటూ కంగారు పడ్డారు. విశాల్ ఆరోగ్యం పాడైంది అంటూ వార్తలు వచ్చాయి. దీంతో విశాల్ డాక్టర్లు అతను కేవలం వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాడు అని క్లారిటీ ఇచ్చారు. ఓ నాలుగు రోజుల తర్వాత విశాల్ మళ్ళీ ఎప్పట్లానే నార్మల్ గానే కనపడ్డాడు.
అయితే కొంతమంది తమిళ యూట్యూబర్స్ మాత్రం విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు ప్రచారం చేసారు. విశాల్ మద్యానికి బానిస అయ్యాడని, విశాల్ కి నరాల బలహీనత వచ్చిందని, విశాల్ కి పలు జబ్బులు ఉన్నాయని, అతనితో ఎవరూ నటించడానికి ఇష్టపడట్లేదని, విశాల్ సినిమాలకు దూరమవుతారు అంటూ ఇష్టమొచ్చినట్టు ప్రమోట్ చేసారు. దీంతో విశాల్ పై తప్పుడు వార్తలు రాసిన ఓ మూడు యూట్యూబ్ ఛానల్స్ పై తమిళ నటీనటుల సంఘం తరపున నాజర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో ఆ మూడు యూట్యూబ్ ఛానల్స్ పై పరువు నష్టం, ఐటీ యాక్ట్ కింద పలు కేసులు నమోదు చేసారు.
Also Read : Madha Gaja Raja : 12 ఏళ్ళ తర్వాత రిలీజయి హిట్ కొట్టిన విశాల్ సినిమా.. ఇప్పుడు తెలుగులో.. ట్రైలర్ చూసారా?