Ram Charan: బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. టాలెంట్ లేకపోతే నెట్టుకు రావడం కష్టం: రామ్ చరణ్
ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ టాలెంట్ లేకపోతే నెట్టుకు రావడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు.
- Author : Balu J
Date : 20-03-2023 - 10:34 IST
Published By : Hashtagu Telugu Desk
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెపోటిజంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ టాలెంట్ లేకపోతే నెట్టుకు రావడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో తాజాగా జరిగిన ఇండియా టుడే కాన్ క్లేవ్‌కు రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజం చెప్పాలంటే..నెపోటిజం అంటే ఏంటో తనకు అసలు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఇటీవల దీని గురించి అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటున్నారని చెప్పారు. సినీ ఇండస్ట్రీలో బంధుప్రీతి ఉందని, అందువల్లే కొందరు రాణిస్తున్నారని భావించే వారి వల్లే ఈ చర్చ జరుగుతోందన్నారు. ఒక స్టార్ హీరో కుమారుడిగానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ, తన ప్రయాణాన్ని తానే ముందుకు సాగించాల్సి ఉంటుందన్నారు.
టాలెంట్ లేకపోతే ఇండస్ట్రీలో ముందుకు వెళ్లడం చాలా కష్టమని, ప్రేక్షకుల ప్రోత్సాహం కూడా ఉండదని చెప్పారు. తనకు నటన అంటే ఎంతో ఇష్టమని, నచ్చిన పని చేసుకుంటూ వెళ్తుండడం వల్లే 14 ఏళ్లుగా ఇండస్ట్రీలో నిలబడగలిగానని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కొద్ది రోజులు కిందట హీరోలు నాని, రానా కూడా నెపోటిజంపై స్పందించిన విషయం తెలిసిందే. నెపోటిజాన్ని ప్రోత్సహించేది ప్రేక్షకులే అని నాని పేర్కొనగా, సినిమాల్లో పరిచయం వరకే బ్యాగ్రౌండ్ ఉపయోగపడుతుందని, టాలెంట్ లేకపోతే ఇండస్ట్రీలో నిలబడటం సులువు కాదని రానా వ్యాఖ్యానించారు.