Mohini Dey : ఏఆర్ రెహమాన్ నాకు తండ్రి లాంటివారు : మోహిని దే.. ఈమె ఎవరు ?
దాదాపు ఎనిమిదిన్నర ఏళ్ల పాటు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ టీమ్‌లో బాసిస్ట్‌గా(Mohini Dey) పనిచేశాను.
- By Pasha Published Date - 09:32 AM, Tue - 26 November 24

Mohini Dey : ప్రముఖ సంగీతకారుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరాబాను నుంచి విడిపోతున్నట్లు నవంబర్ 19న ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ టీమ్‌లోని మోహిని దే కూడా తన భర్త మార్క్ హార్ట్సుచ్ నుంచి విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. దీంతో ఏఆర్ రెహమాన్, మోహిని దే గురించి పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. అప్పట్లోనే ఈ పుకార్లను తీవ్రంగా ఖండించిన మోహిని.. ఇప్పుడు మరోసారి అదే అంశంపై మాట్లాడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘ పుకార్లను ఎవరూ నమ్మొద్దు. ఏఆర్ రెహమాన్ నాకు తండ్రి లాంటి వారు. నేను ఐదేళ్ల క్రితమే ఇండియా నుంచి అమెరికాకు వెళ్లిపోయాను. అంతకుముందు దాదాపు ఎనిమిదిన్నర ఏళ్ల పాటు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ టీమ్‌లో బాసిస్ట్‌గా(Mohini Dey) పనిచేశాను. నేను అమెరికాలోని అనేక మంది పాప్ కళాకారులతోనూ కలిసి పని చేస్తుంటాను. ఏఆర్ రెహమాన్, సైరాబానుల వ్యక్తిగత విషయాల్లోకి నన్ను లాగొద్దు. ఎవరూ ఆ విషయంలో జోక్యం చేసుకోవద్దు. అది వారి కుటుంబం విషయం. ఆ దంపతుల ప్రైవసీని గౌరవించాలి’’ అని మోహిని దే కోరారు.
Also Read :Salicylic Acid : ఇంట్లో సాలిసిలిక్ యాసిడ్ స్కిన్ క్లెన్సర్‌ను ఎలా తయారు చేయాలి..?
‘‘ఇటీవలే నేను ఒక టూర్‌కు వెళ్లాను. అది పూర్తయి ఇప్పుడు తీరిక దొరికింది. అందుకే మీకు అన్ని వివరాలు చెబుతున్నాను. రెహమాన్ నాకు తండ్రి లాంటి వారు. రెహమాన్ కూతురు, నేను ఒకే వయసు వాళ్లం. మా గురించి తప్పుగా ఆలోచిస్తున్న వారి మానసిక స్థితిని తలచుకుంటే చాలా బాధేస్తోంది. ఇతరుల కుటుంబానికి సంబంధించిన భావోద్వేగ అంశాలపై మనకు గౌరవం, సానుభూతి ఉండాలి కదా ?’’ అని మోహిని దే తెలిపారు. ‘‘నాకు జీవితంలో రోల్ మోడల్స్, తండ్రిలాంటి వారు కొందరే ఉన్నారు. వారిలో ఏఆర్ రెహమాన్ ఒకరు. మా నాన్నే నాకు తొలుత మ్యూజిక్ నేర్పారు. ఆయన ఏడాది క్రితమే చనిపోయారు. మ్యూజిక్ ఇండస్ట్రీలో నాకు తండ్రిలా అవకాశాలు ఇచ్చిన మహా మనిషి ఏఆర్ రెహమాన్’’ అని ఆమె చెప్పుకొచ్చారు. ఇకనైనా తప్పుడు ప్రచారాలను, పుకార్ల వ్యాప్తిని ఆపాలని నెటిజన్లను మోహిని కోరారు.
మోహిని దే ఎవరు ?
- మోహిని దే 1996 జులై 20న బెంగాల్‌లోని కోల్‌కతాలో జన్మించారు.
- ఆమె ఒక బాస్ సంగీతకారిణి.
- కోక్ స్టూడియో ఇండియా వంటి ప్రముఖ మ్యూజిక్ కంపెనీలతో, ఏఆర్ రెహమాన్ వంటి ప్రముఖ సంగీతకారులతో ఆమె కలిసి పనిచేస్తుంటారు.
- మోహిని ముంబైలో పెరిగారు.
- ఆమె తండ్రి కూడా ఒక సంగీతకారుడు.
- చిన్నప్పటి నుంచే మోహినికి సంగీతం అంటే ఆసక్తి. అందుకే పదేళ్ల వయసు నుంచే వాళ్ల నాన్న ఆమెకు సంగీతం నేర్పించారు.
- 11 ఏళ్ల వయసు నుంచే మోహిని సంగీత ప్రదర్శనలు ఇవ్వడం ఆరంభించింది.
- మన దేశానికి చెందిన ప్రముఖ పియానిస్ట్ లూయిస్ బ్యాంక్స్ కూడా తన టీమ్‌లో మోహినికి చోటు కల్పించారు.
- మోహిని.. మార్క్ హార్ట్‌సచ్ అనే సాక్సో ఫోనిస్ట్ సంగీతకారుడిని పెళ్లి చేసుకుంది.
- 2023 సంవత్సరంలో తొలిసారిగా తన సొంత మ్యూజిక్ ఆల్బమ్‌ను మోహిని దే రిలీజ్ చేశారు. అందులో మోహిని, ఆమె భర్త సంగీతాన్ని అందించారు.
- మోహినికి మరాఠీ, హిందీ, బెంగాలీ, ఇంగ్లిష్ భాషలు వచ్చు.