Balakrishna : ఆ ప్రకటనలను నమ్మోదంటూ ప్రజలకు హెచ్చరిక జారీ చేసిన బాలకృష్ణ
Balakrishna : అనధికారికంగా హాస్పిటల్ పేరు వినియోగించి జరిగే ఇలాంటి మోసాలను నమ్మి, ఎవరు తమ డబ్బును కోల్పోవద్దని ఆయన హితవు పలికారు
- By Sudheer Published Date - 09:54 PM, Tue - 29 July 25

ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వ్యవస్థాపకులుగా ఉన్న ఆయన, హాస్పిటల్ పేరును ఉపయోగిస్తూ జరుగుతున్న అనధికారిక కార్యక్రమాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్” పేరిట అట్లూరి అశ్విన్ అనే అతడు తన పేరు, హాస్పిటల్ పేరు వినియోగిస్తూ విరాళాలు సేకరించేందుకు ప్రణాళికలు రూపొందించారని తెలిపారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ ప్రజలకు బహిరంగంగా విజ్ఞప్తి చేస్తూ.. ఆ ఈవెంట్‌కు తాను ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బసవతారకం హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు నుంచి కూడా ఎటువంటి అధికారిక ఆమోదం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇలాంటి ఫేక్ ఈవెంట్లు, మోసపూరిత కార్యక్రమాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
New Ration Cards : ఏపీలో కోటి 21 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు – మంత్రి మనోహర్ కీలక ప్రకటన
హాస్పిటల్ తరఫున జరిగే అన్ని కార్యక్రమాలు, విరాళాల సేకరణలు కేవలం ధృవీకరించబడిన, నమ్మదగిన మాధ్యమాల ద్వారా మాత్రమే నిర్వహించబడతాయని బాలకృష్ణ తెలిపారు. ఏదైనా కార్యక్రమం అధికారికంగా జరుగుతుంటే, దానికి సంబంధించిన సమాచారం హాస్పిటల్ అధికారిక వెబ్‌సైట్ లేదా మీడియా ద్వారా మాత్రమే ప్రజలకు చేరవేస్తామని స్పష్టం చేశారు.
అనధికారికంగా హాస్పిటల్ పేరు వినియోగించి జరిగే ఇలాంటి మోసాలను నమ్మి, ఎవరు తమ డబ్బును కోల్పోవద్దని ఆయన హితవు పలికారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లక్షలు మంది రోగులకు నిబద్ధతతో సేవలందిస్తోందని పేర్కొంటూ, ఈ సేవలకు చెరగని మచ్చ పడకుండా ప్రజలు సహకరించాలని బాలకృష్ణ కోరారు.