Padma Bhushan : పద్మభూషణ్ నాలో ఇంకా కసిని పెంచింది – బాలకృష్ణ
Balakrishna : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డు తనలో ఇంకా ఉత్సాహాన్ని, కసిని పెంచిందని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు
- By Sudheer Published Date - 04:05 PM, Mon - 3 February 25

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డు (Padma Bhushan) తనలో ఇంకా ఉత్సాహాన్ని, కసిని పెంచిందని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) పేర్కొన్నారు. ఈ పురస్కారం తన సినీ, రాజకీయ జీవితాల్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభం అయినట్టుగా భావిస్తున్నట్లు తెలిపారు. బాలకృష్ణ అభిమానులు, టీడీపీ శ్రేణులు ఈ అవార్డుపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (NTR) కు భారతరత్న రావాలని, అది కచ్చితంగా సాధించగలమని బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. తెలుగు సినిమా, తెలుగు ప్రజల గర్వించదగిన వ్యక్తి అయిన ఎన్టీఆర్‌కు ఇప్పటికీ దేశ అత్యున్నత పురస్కారం రాకపోవడం బాధాకరమని, భవిష్యత్తులో అది తప్పకుండా ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. తనకు ఎవరూ ఛాలెంజ్ కాదని, తన నటనలో పోషించిన విభిన్నమైన పాత్రలే తనకు నిజమైన ఛాలెంజ్ అని బాలకృష్ణ అన్నారు. కెరీర్‌లో ఎన్నో ప్రయోగాత్మక పాత్రలు పోషించానని, ప్రతి పాత్ర తనను కొత్త కోణంలో ఆలోచించేందుకు ప్రేరేపించిందని చెప్పారు. సినిమా రంగంలో తన ప్రస్థానం ఇంకా చాలా దూరం ఉందని, మరో కొత్త దశలోకి అడుగుపెట్టబోతున్నానని తెలిపారు.
ఒక వ్యక్తి ఏ స్థాయికి చేరుకున్నా తృప్తిపడకూడదని, ఇంకా కొత్త లక్ష్యాల కోసం కృషి చేయాలని బాలకృష్ణ తెలిపారు. మనిషి ఒకస్థాయితో తృప్తి పడకూడదని.. మనల్ని మనం పదును పెట్టుకోవాలనే తపన ఉండాలని, అదే తనను నడిపిస్తోందని పేర్కొన్నారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని, ప్రేక్షకులకు, ప్రజలకు మరింత ఉత్తమమైన సేవలందించేందుకు ముందుకు సాగుతానని స్పష్టం చేశారు.
నాకు పద్మ భూషణ్ కాదు… నాన్నకు భారత్ రత్న రావాలి..కేంద్ర ప్రభుత్వం మొన్న నాకు పద్మభూషణ్ అవార్డు కంటే… నాన్నకు భారతరత్న అవార్డు రావాలని కోట్లాది మంది తెలుగు ప్రజలు ఆకాంక్ష….#BreakingNews #TeluguNews #NandamuriBalakrishna #Balakrishna #NTR #HashtagU pic.twitter.com/veejunxdx2
— Hashtag U (@HashtaguIn) February 3, 2025