Akhanda 2 Collections : బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల తాండవం చూపించిన బాలయ్య
Akhanda 2 Collections : ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా ‘అఖండ 2’ తొలిరోజు రూ.65 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు
- Author : Sudheer
Date : 13-12-2025 - 1:00 IST
Published By : Hashtagu Telugu Desk
నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ 2’ చిత్రం విడుదలైన తొలిరోజే బాక్సాఫీస్ వద్ద మాస్ సునామీని సృష్టిస్తోంది. డిసెంబర్ 11 రాత్రి ప్రీమియర్స్ నుంచే ఈ చిత్రం భారీ హైప్‌తో ప్రారంభమైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకాయి. మాస్ యాక్షన్, ఆధ్యాత్మికత, హై-వోల్టేజ్ ఎలివేషన్ల లతో కూడిన కథనం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా బాలకృష్ణ నట విశ్వరూపం, శివతాండవ దృశ్యాలను తలపించే ఫైట్ సీక్వెన్సులు అభిమానులకు పూనకాలు తెప్పించాయి. థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు, రికార్డు స్థాయి రద్దీతో ‘అఖండ 2’ బాలయ్య కెరీర్‌లోనే మరొక మైలురాయిని చేరుకుందని చెప్పవచ్చు. పెద్ద సినిమాల పోటీ లేకపోవడం ఈ సినిమా కలెక్షన్లకు మరింత బూస్ట్ ఇచ్చింది.
Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు కు ముహూర్తం ఫిక్స్!
ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం.. ఈ చిత్రానికి వస్తున్న స్పందన కలెక్షన్లలో స్పష్టంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం మేరకు బుక్ మై షోలో గంటకు 10 వేల నుంచి 15 వేల టిక్కెట్ల బుకింగ్స్ నమోదవుతున్నాయట. ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా ‘అఖండ 2’ తొలిరోజు రూ.65 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే సాక్నిల్క్ (Sacnilk) వెబ్‌సైట్ అందించిన వివరాల ప్రకారం.. ప్రీమియర్లతో కలిపి మొదటి రోజు ఇండియాలో ఈ చిత్రం రూ.36.18 కోట్ల నికర (నెట్) వసూళ్లను సాధించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ.30.75 కోట్లు, కర్ణాటకలో రూ.3.77 కోట్లు ఉన్నాయి. ఈ భారీ ఓపెనింగ్స్ బాలకృష్ణ కెరీర్‌లోనే అరుదైన రికార్డుల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని సినీ పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
ICC- JioStar: ఐసీసీ- జియోస్టార్ డీల్ పై బ్రేక్.. పుకార్లను ఖండించిన ఇరు సంస్థలు!
2021లో వచ్చిన ‘అఖండ’ మొదటి భాగం సైతం కరోనా పరిస్థితుల్లోనూ సుమారు రూ.30 కోట్ల గ్రాస్ ఓపెనింగ్‌ను సాధించి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు సీక్వెల్‌గా వచ్చిన ‘అఖండ 2’ ఆ మార్క్‌ను ఎన్నో రెట్లు అధిగమించే దిశగా దూసుకుపోతోంది. మాస్ ప్రేక్షకులు సినిమాను విపరీతంగా ఆదరిస్తుండటంతో, వీకెండ్ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ జోరు ఇలాగే కొనసాగితే, ‘అఖండ 2’ కేవలం మొదటి వారంలోనే దాదాపు రూ.150 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాలయ్య-బోయపాటి కాంబోపై అభిమానులకున్న నమ్మకం, మాస్ ఎమోషన్‌కు పెద్దపీట వేసే బోయపాటి టేకింగ్ ఈ సినిమాను మరో బ్లాక్‌బస్టర్ దిశగా నడిపిస్తున్నాయి. మొత్తానికి, ‘అఖండ 2’ బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌లలో ఒకటిగా నిలిచి, బాక్సాఫీస్‌పై తన సత్తాను చాటుతోంది.