Govt Banks : ఐదు గవర్నమెంటు బ్యాంకుల్లో వాటాల అమ్మకం.. కీలక అప్‌డేట్
ఆ ఐదు ప్రభుత్వరంగ బ్యాంకులకు(Govt Banks) సంబంధించిన వాటాల విక్రయ ప్రక్రియలో చేదోడును అందించేందుకు ఆసక్తి కలిగిన మర్చంట్ బ్యాంకర్‌లు, న్యాయ సంస్థల నుంచి బిడ్‌లను దీపం ఆహ్వానించింది.
- By Pasha Published Date - 08:56 AM, Tue - 25 February 25

Govt Banks : కేంద్రంలోని మోడీ సర్కారు చెప్పినంత పని చేస్తోంది. ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని వాటాల విక్రయం దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ప్రభుత్వానికి 86.46 శాతం వాటా ఉంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో సర్కారుకు 96.38 శాతం వాటా ఉంది. యూకో బ్యాంకులో ప్రభుత్వానికి 95.39 శాతం వాటా ఉంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సర్కారుకు 93.08 శాతం వాటా ఉంది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో సర్కారుకు 98.25 శాతం వాటా ఉంది. ఈ వాటాలను 75 శాతానికి తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ప్రభుత్వానికి చెందిన పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోంది.
Also Read :Top 10 Tourist Places: దేశంలోని టాప్ -10 టూరిస్టు ప్రదేశాల్లో హైదరాబాద్ హవా
మర్చంట్ బ్యాంకర్‌లు, న్యాయ సంస్థల నుంచి బిడ్లు
ఆ ఐదు ప్రభుత్వరంగ బ్యాంకులకు(Govt Banks) సంబంధించిన వాటాల విక్రయ ప్రక్రియలో చేదోడును అందించేందుకు ఆసక్తి కలిగిన మర్చంట్ బ్యాంకర్‌లు, న్యాయ సంస్థల నుంచి బిడ్‌లను దీపం ఆహ్వానించింది. మర్చంట్ బ్యాంకర్లను మూడేళ్ల కాలవ్యవధి కోసం నియమిస్తామని వెల్లడించింది. అవసరమైతే మరో ఏడాది పాటు ఈ గడువును పొడిగించే అవకాశం ఉంటుందని తెలిపింది. ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాల విక్రయానికి సరైన సమయం, విధివిధానాలపై ప్రభుత్వానికి సదరు మర్చంట్ బ్యాంకర్‌లు, న్యాయ సంస్థలు సలహాలను అందించనున్నాయి. ఎంప్యానెల్‌మెంట్ కోసం మర్చంట్ బ్యాంకర్లు రూ.1 లక్ష ఫీజు, లీగల్ అడ్వైజర్లు రూ.50వేల ఫీజును చెల్లించాలని దీపం కోరింది. ఆసక్తి కలిగిన సంస్థలు మార్చి 27 వరకు బిడ్‌లను దాఖలు చేయొచ్చని తెలిపింది.
Also Read :Earthquake Today: ఢిల్లీని మించిన రేంజులో బెంగాల్‌లో భూకంపం.. బంగాళాఖాతంలో భూకంప కేంద్రం
ఎల్‌ఐసీలోనూ వాటా విక్రయం
2026 ఆగస్టు నాటికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూకో బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుల్లో పబ్లిక్ షేర్ హోల్డింగ్‌ను 25 శాతానికి చేరుస్తామని దీపం అంటోంది. మరోవైపు జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కేంద్ర సర్కారుకు 82.4 శాతం వాటా ఉంది. న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలో సర్కారుకు 85.44 శాతం వాటా ఉంది. ఎల్ఐసీలో ప్రభుత్వానికి 96.5 శాతం వాటా ఉంది. ఎల్ఐసీలోని 10 శాతం వాటాను 2027 మే 16 నాటికి విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.