Telugu billionaires in Forbes India 2025 : టాప్-100 కుబేరుల్లో తెలుగు వారు ఎవరంటే?
Telugu billionaires in Forbes India 2025 : ఫోర్బ్స్ ఇండియా 2025 బిలియనీర్ల జాబితాలో తెలుగు వ్యాపారవేత్తలకు విశిష్ట స్థానం దక్కింది. ఔషధ, ఇంజినీరింగ్, హెల్త్‌కేర్ రంగాల్లో తమ కృషితో గ్లోబల్ స్థాయిలో పేరు సంపాదించిన తెలుగు ఇండస్ట్రియలిస్టులు ఈ సారి కూడా జాబితాలో నిలిచారు.
- By Sudheer Published Date - 10:15 AM, Sun - 12 October 25

ఫోర్బ్స్ ఇండియా 2025 బిలియనీర్ల జాబితాలో తెలుగు వ్యాపారవేత్తలకు విశిష్ట స్థానం దక్కింది. ఔషధ, ఇంజినీరింగ్, హెల్త్‌కేర్ రంగాల్లో తమ కృషితో గ్లోబల్ స్థాయిలో పేరు సంపాదించిన తెలుగు ఇండస్ట్రియలిస్టులు ఈ సారి కూడా జాబితాలో నిలిచారు. ప్రముఖ ఫార్మా కంపెనీ దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత మురళి దివి రూ.88,000 కోట్ల ఆస్తులతో దేశవ్యాప్తంగా 25వ స్థానంలో నిలిచారు. ఆయన నేతృత్వంలో దివీస్ ల్యాబ్ అంతర్జాతీయ మార్కెట్లో విశ్వసనీయతను సంపాదించి, ఫార్మా రంగంలో భారత్ ప్రతిష్ఠను పెంచింది.
ఇంజినీరింగ్ రంగంలో ఆధిపత్యం చాటుకున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) చైర్మన్‌లు పీపీ రెడ్డి మరియు పీవీ కృష్ణారెడ్డి రూ.70వ స్థానంలో చోటు దక్కించుకున్నారు. భారీ ప్రాజెక్టులు, జలవనరుల నిర్మాణం, గ్యాస్ పైప్‌లైన్‌లతో దేశ అభివృద్ధిలో MEIL కీలక పాత్ర పోషిస్తోంది. అదే విధంగా, విమానాశ్రయాలు, రహదారులు, విద్యుత్ ప్రాజెక్టుల రంగాల్లో విస్తరించిన జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంథి మల్లికార్జున రావు 83వ స్థానంలో ఉన్నారు. ఆయన విజన్ కారణంగా హైదరాబాదు మరియు ఢిల్లీ ఎయిర్‌పోర్టులు అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన మోడల్‌గా నిలిచాయి.
హెల్త్‌కేర్ రంగంలో విశేష కీర్తి పొందిన అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి 86వ స్థానంలో నిలిచారు. ఆయన భారత్‌లో కార్పొరేట్ హెల్త్‌కేర్ వ్యవస్థకు పునాదులు వేసి, ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు. హెటిరో గ్రూప్ ఛైర్మన్ పార్థసారథి రెడ్డి 89వ స్థానంలో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అధినేత సతీష్ రెడ్డి 91వ స్థానంలో నిలవడం తెలుగు వ్యాపార వేత్తల ప్రతిభను మరింత ప్రతిష్ఠాత్మకంగా నిలిపింది. ఈ జాబితా మరోసారి తెలుగు పారిశ్రామికవేత్తల దేశ ఆర్థిక ప్రగతిలోని దోహదాన్ని స్పష్టంగా చాటింది.