Stock Market Fraud : స్టాక్ మార్కెట్ టిప్స్ పేరుతో సైబర్ కేటుగాళ్ల మోసాలు
సైబర్ నేరగాళ్లు సందు దొరికిన ప్రతీచోటా మోసానికి తెగబడుతున్నారు.
- Author : Pasha
Date : 29-05-2024 - 7:03 IST
Published By : Hashtagu Telugu Desk
Stock Market Fraud : సైబర్ నేరగాళ్లు సందు దొరికిన ప్రతీచోటా మోసానికి తెగబడుతున్నారు. చివరికి వాళ్లు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్లను కూడా చీట్ చేస్తున్నారు. వాస్తవానికి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లావాదేవీలు చాలా సురక్షితంగా, అత్యంత భద్రత నడుమ జరుగుతుంటాయి. అలాంటి వాటిలో సైబర్ కేటుగాళ్లు ఎలా జోక్యం చేసుకుంటున్నారో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..
We’re now on WhatsApp. Click to Join
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్లలో కొంతమంది లాభదాయకమైన టిప్స్ కోసం ప్రతీచోటా భూతద్దం పెట్టి వెతుకుతుంటారు. అలాంటి వాళ్లనే సైబర్ కేటుగాళ్లు తమ టార్గెట్‌గా ఎంచుకుంటున్నారు. ఈక్రమంలో వాళ్లు తొలుత వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ గ్రూపుల్లోకి చొరబడుతున్నారు. ప్రత్యేకంగా కొన్ని స్టాక్ మార్కెట్ టిప్స్ గ్రూపులను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు కూడా. ఈ చోట ఎవరైనా వాళ్ల ట్రాప్‌కు చిక్కితే ఖేల్ ఖతం. సైబర్ కేటుగాళ్లు తొలుత చాలా నమ్మకంగా మాట్లాడుతారు. ఉచితంగా షేర్ మార్కెట్ టిప్స్ అందిస్తామని బుకాయిస్తారు. తమ టిప్స్‌తో లక్షాధికారి అయిపోవచ్చని చెబుతూ కలల లోకంలోకి తీసుకెళ్తారు. ఆ తర్వాత మిమ్మల్ని వాళ్ల వాట్సాప్ గ్రూపుల్లో చేర్చుకుంటారు. ఆ తర్వాతే అసలు కథంతా మొదలవుతుంది.
Also Read :Robot Dogs : రోబో డాగ్స్ రెడీ.. శత్రువులను కాల్చి పారేస్తాయ్
ఏం చేస్తారో తెలుసా ?
సైబర్ కేటుగాళ్ల దగ్గర నకిలీ ట్రేడింగ్ అకౌంట్లు, వాటికి సంబంధించిన సాఫ్ట్‌వేర్లు ఉంటాయి. వాటినే తమకు చిక్కిన అమాయక ట్రేడర్లకు ఇస్తారు. వీటిలో పెట్టిన చిన్నచిన్న పెట్టుబడులకు భారీగా లాభాలు వస్తాయని చూపిస్తారు. ఒకవేళ ఆ ఫేక్ అకౌంటు నుంచి డబ్బులు తీసేందుకు యత్నిస్తే.. సెబీ మీ అకౌంట్‌ను లాక్ చేసిందని, ఫండ్స్ నిలిచిపోయాయని బుకాయిస్తారు. ట్రేడింగు అకౌంటులో బ్లాక్ అయిన డబ్బులు బయటికి రావాలంటే.. ముందుగా ట్యాక్స్, పోర్ట్‌ఫోలియో ఛార్జీలను పే చేయాలని నమ్మిస్తారు. ఆ రకంగా డబ్బులన్నీ లాగాక.. బిచాణా(Stock Market Fraud) ఎత్తేస్తారు. ఇక ఫోన్ కాల్స్‌కు స్పందించరు. కొంతమంది సైబర్ కేటుగాళ్లయితే ఏకంగా జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పేరుతో నకిలీ వాట్సప్ గ్రూపులు, సోషల్‌మీడియా అకౌంట్లు తెరిచి నడుపుతుండటం గమనార్హం.