SBI FD rates : ఎస్‌బీఐ ఎఫ్‌డీ రేట్లలో కోత.. తాజా వడ్డీ రేట్ల వివరాలు ఇవీ..
జూన్ 15, 2025 నుంచి ఈ కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీని ప్రభావంతో బ్యాంకింగ్ రంగంలో ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ (HDFC), ఐసీఐసీఐ (ICICI) వంటి బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లను సవరించాయి.
- By Latha Suma Published Date - 03:07 PM, Mon - 16 June 25

SBI FD rates : ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా వడ్డీ రేట్లను తగ్గించింది. అన్ని రకాల ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు (FDs) మరియు సేవింగ్స్ అకౌంట్‌లపై అమలులో ఉన్న వడ్డీ రేట్లలో గరిష్ఠంగా 50 బేసిస్ పాయింట్ల మేర కోత పెట్టింది. జూన్ 15, 2025 నుంచి ఈ కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీని ప్రభావంతో బ్యాంకింగ్ రంగంలో ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ (HDFC), ఐసీఐసీఐ (ICICI) వంటి బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లను సవరించాయి. తాజాగా వాటి బాటలో ఎస్‌బీఐ కూడా చేరింది.
ఈ తగ్గింపుతో తక్కువ కాలం FDలపై ప్రస్తుతం ఉన్న వడ్డీ శాతం మరింత తగ్గనుంది. అంతేకాకుండా, చిన్న పొదుపుదారులకు ఇది కొంత ప్రతికూలంగా మారవచ్చు. అయితే, రుణాలపై వడ్డీ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉండటంతో రుణదారులకు ఇది శుభవార్తగా చెప్పుకోవచ్చు. వడ్డీ రేట్లలో ఈ మార్పులు మార్కెట్‌లో నికర డిమాండ్‌ను ప్రోత్సహించే దిశగా ఉంటాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
.ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అన్ని కాలవ్యవధులపై 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీని ఎస్‌బీఐ తగ్గించింది. ఇకపై ఎఫ్‌డీలపై కనిష్ఠంగా 3.05 శాతం, గరిష్ఠంగా 6.45 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు కనిష్ఠంగా 3.55 శాతం, గరిష్ఠంగా 7.05 శాతం వడ్డీ (ఎస్‌బీఐ వియ్ కేర్ సహా) లభిస్తుంది.
.‘అమృత్ వృష్టి’ పేరుతో 444 రోజుల కాలవ్యవధిపై అందిస్తున్న ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై మాత్రమే అత్యధికంగా 6.60 శాతం వడ్డీని ఎస్‌బీఐ ఆఫర్ చేస్తోంది. గతంలో 6.85 శాతం వడ్డీని అందించేది. సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం వడ్డీ లభిస్తుంది.
. ఎస్‌బీఐ సేవింగ్స్ ఖాతాలపై అందించే వడ్డీ రేట్లను సైతం తగ్గించింది. పొదుపు ఖాతాల్లో ఉండే నగదు నిల్వలపై ఇకపై ఏడాదికి 2.5 శాతం మేర వడ్డీ అందించనుంది. ఇవి కూడా జూన్ 15 నుంచే అమల్లోకి వచ్చాయి. ఇంతకుముందు రూ.10 కోట్ల లోపు బ్యాలెన్స్‌పై 2.7 శాతం, రూ.10 కోట్లు పైబడి మొత్తంపై 3 శాతం వడ్డీ అందించేది.