RBI Repo Rate : లోన్ తీసుకున్న వారికీ పండగే !!
RBI Repo Rate : తాజాగా మరోసారి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వడ్డీ రేట్లను తగ్గించి, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే దిశగా అడుగు వేసింది. ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ (MPC) మూడు రోజుల పాటు సమావేశమై తీసుకున్న నిర్ణయాలను గవర్నర్
- By Sudheer Published Date - 11:16 AM, Fri - 5 December 25
RBI మరోసారి తీపి కబురు తెలిపింది. ప్రస్తుత కాలంలో సగటు మానవుడు తమ కోర్కెలను తీర్చుకునేందుకు బ్యాంకు లపై ఆధారపడుతున్నారు. సొంతింటి కల నెరవేర్చుకోవడానికి , లేదా వాహనాలు కొనుగోలు చేయడానికి ఇలా ఏదైనా సరే బ్యాంకు లోన్ తీసుకోని తమ కోర్కెలను తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో RBI సైతం లోన్ తీసుకున్నవారికి , తీసుకోబోయేవారికి ఎప్పటికప్పుడు తీపి కబుర్లు అందజేస్తుంది. ముఖ్యంగా Repo రేట్ ను తగ్గిస్తూ లోన్ దారుల్లో సంతోషం నింపుతుంది.
తాజాగా మరోసారి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వడ్డీ రేట్లను తగ్గించి, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే దిశగా అడుగు వేసింది. ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ (MPC) మూడు రోజుల పాటు సమావేశమై తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం ప్రకటించారు. తాజా నిర్ణయంతో రెపో రేటును మరో 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) తగ్గించారు. దీంతో రెపో రేటు 6.50 శాతం నుంచి ప్రారంభమై, ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్ నెలల్లో వరుసగా కోతలు విధించగా, తాజాగా జరిగిన తగ్గింపుతో అది 5.25 శాతానికి చేరింది. ఈ క్యాలెండర్ సంవత్సరంలో వడ్డీ రేట్లను తగ్గించడం ఇది నాలుగోసారి కావడం విశేషం. ఈ క్రమంలో, రెపో రేటు మొత్తం 125 బేసిస్ పాయింట్లు (1.25 శాతం) తగ్గింది.
Akhanda 2 New Release Date : ఈరోజు రాత్రికే ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు!
ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణాలు ద్రవ్యోల్బణం (Inflation) అదుపులో ఉండటం మరియు స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి రేటు గణనీయంగా పెరగడం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికం (జులై-సెప్టెంబర్)లో జీడీపీ వృద్ధి రేటు ఏకంగా 8.20 శాతంగా నమోదైంది. ఇది గత ఆరు త్రైమాసికాల గరిష్టం కావడం, ఆర్బీఐ అంచనా (7 శాతం) కంటే అధికంగా ఉండటం శుభపరిణామం. మరోవైపు, రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా తగ్గుతూ వచ్చి, అక్టోబర్ నెలలో 0.25 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాల ధరలు తగ్గడం, జీఎస్టీ రేట్ల కోత వంటి అంశాలు ద్రవ్యోల్బణం అదుపులోకి రావడానికి దోహదపడ్డాయి. ఈ సానుకూల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోనే, కమిటీ సభ్యులంతా ఏకగ్రీవంగా వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆమోదం తెలిపారు.
రెపో రేటు తగ్గింపు వల్ల సామాన్య ప్రజలకు తక్షణ ప్రయోజనం చేకూరనుంది. ఆర్బీఐ రెపో రేటును తగ్గించిన వెంటనే, వాణిజ్య బ్యాంకులు తమ లోన్ల వడ్డీ రేట్లను తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. దీని ఫలితంగా హోమ్ లోన్తో పాటు ఇతర వ్యక్తిగత, వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. దీంతో కొత్తగా రుణాలు తీసుకునే వారికి తక్కువ వడ్డీకే రుణాలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే ఫ్లోటింగ్ రేటు (Floating Rate) పై లోన్లు తీసుకున్నవారికి, తమ లోన్ టెన్యూర్ (తిరిగి చెల్లించే కాలం) ను తగ్గించుకోవడానికి లేదా నెలవారీ ఈఎంఐ (EMI) ను తగ్గించుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఈ వడ్డీ రేట్ల తగ్గింపు వినియోగదారుల కొనుగోలు శక్తిని పెంచి, భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి మరింత ఊతమిస్తుందని భావిస్తున్నారు.