RBI Gold Reserves : RBI వద్ద రూ.7.26 లక్షల కోట్ల బంగారం
RBI Gold Reserves : ఆర్బీఐ వద్ద ప్రస్తుతం 879.98 టన్నుల బంగారం నిల్వగా ఉంది. ఈ కొనుగోలుతో బంగారం నిల్వల మొత్తం విలువ రూ.7.26 లక్షల కోట్లకు (సుమారు 84.5 బిలియన్ డాలర్లు) పెరిగిందని ఆర్బీఐ వెల్లడించింది
- By Sudheer Published Date - 12:39 PM, Sun - 27 July 25

దేశ ఆర్థిక స్థిరతకు పునాది అయిన రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన బంగారు నిల్వలను భారీగా పెంచుకుంది. తాజాగా విడుదల చేసిన నెలవారీ బులిటెన్ ప్రకారం.. ఆర్బీఐ వద్ద ప్రస్తుతం 879.98 టన్నుల బంగారం నిల్వగా ఉంది. ఈ కొనుగోలుతో బంగారం నిల్వల మొత్తం విలువ రూ.7.26 లక్షల కోట్లకు (సుమారు 84.5 బిలియన్ డాలర్లు) పెరిగిందని ఆర్బీఐ వెల్లడించింది.
అమెరికన్ డాలర్ బలహీనపడటం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి వంటివి బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ముఖ్యంగా జూన్ నెల ప్రథమార్ధంలో బంగారం రేట్లు భారీగా పెరిగాయి. పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి సాధనంగా పసిడిని ఎక్కువగా ఎంచుకోవడం, మౌలిక అంశాల ప్రభావం కూడా బంగారం రేట్లను పెంచింది. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ కూడా బంగారంపై పెట్టుబడులు పెంచింది.
AP News : ఏపీ చట్టసభలకు సంబంధించి వివిధ కమిటీలు ఏర్పాటు
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను పెంచుతున్నాయి. అనిశ్చిత అంతర్జాతీయ పరిస్థితుల్లో బంగారం అత్యంత విశ్వసనీయమైన నిల్వ సాధనంగా మారింది. RBI కూడా అదే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ, భారతీయ ఆర్థిక వ్యవస్థ భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ముందుకెళ్తోంది. ప్రస్తుతం భౌగోళిక రాజకీయ పరిస్థితులు కొంతమేర శాంతించిన నేపథ్యంలో బంగారం ధరలు స్థిరంగా మారాయి. అయితే ప్రపంచ ఆర్థిక వాతావరణాన్ని బట్టి రాబోయే రోజుల్లో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. అయినప్పటికీ దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కోసం బంగారం నిల్వలు కీలకంగా మారనున్నట్లు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. RBI తీసుకుంటున్న ఈ నిర్ణయాలు దేశ ఆర్థిక నిబద్ధతను తెలియజేస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.