RBI : లోన్లు తీసుకునేవారికి ఆర్బీఐ గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గింపు!
- By Vamsi Chowdary Korata Published Date - 10:52 AM, Fri - 5 December 25
ఈ ఏడాదిలో వరుసగా రెపో రేట్లను తగ్గిస్తూ వచ్చిన ఆర్బీఐ.. మరోసారి శుభవార్త చెప్పింది. ఈసారి కూడా 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లలో కోత విధించింది. దీంతో లోన్లు ఇదివరకు తీసుకున్నవారికి.. భవిష్యత్తులో తీసుకోబోయే వారికి ఉపశమనం కలుగుతుందని చెప్పొచ్చు. రూపాయి భారీగా పతనం అవుతున్నా.. ఆర్బీఐ రెపో రేటును తగ్గించడం గమనార్హం.
చాలా రోజుల తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో గుడ్‌న్యూస్ చెప్పింది. కీలక వడ్డీ రేట్లను మరోసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఇప్పుడు రెపో రేటు 5.25 శాతానికి చేరింది. 3 రోజులు సమావేశమైన ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ నిర్ణయాల్ని కేంద్ర బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం ఉదయం ప్రకటించారు. ఈ ఏడాది ఇప్పటివరకు వడ్డీ రేట్లను తగ్గించడం ఇది నాలుగోసారి కావడం విశేషం. అంతకుముందు ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున కోత విధించగా.. తర్వాత జూన్ సమీక్షలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్లను తగ్గించింది. ఈ క్రమంలోనే రెపో రేటు ఈ ఏడాది ఆరంభంలో 6.50 శాతంగా ఉండగా.. ఇప్పుడు అది 5.25 శాతానికి చేరింది. ఈ క్రమంలో ఏకంగా 125 బేసిస్ పాయింట్లు లేదా 1.25 శాతం తగ్గిందని చెప్పొచ్చు.
ప్రస్తుతం ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండటం అదే క్రమంలో.. జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా నమోదైన క్రమంలో.. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించాల్సి వచ్చింది. కమిటీ సభ్యులంతా ఏకగ్రీవంగా వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆమోదం తెలిపారని గవర్నర్ వెల్లడించారు.
ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తే.. వెంటనే బ్యాంకులు లోన్ వడ్డీ రేట్లను తగ్గించాల్సి వస్తుంది. అప్పుడు హోం లోన్ ఇతర లోన్ వడ్డీ రేట్లు దిగొస్తాయి. అప్పుడు కొత్తగా లోన్ తీసుకునే వారికి తక్కువ వడ్డీకే రుణాలు అందుబాటులోకి వస్తాయి. ఇంకా.. ఇదివరకు ఫ్లోటింగ్ రేటుపై లోన్లు తీసుకున్నవారికి.. లోన్ టెన్యూర్ తగ్గించుకోవడం లేదా ఈఎంఐ తగ్గించుకోవడానికి వీలుంటుంది.
భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని నవంబర్ 28న కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సెప్టెంబరుతో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జులై- సెప్టెంబర్) జీడీపీ వృద్ధి రేటు 8.20 శాతంగా నమోదైంది. ఇది ఏకంగా 6 త్రైమాసికాల గరిష్టం కావడం విశేషం. ఆర్బీఐ అంచనా ఇక్కడ కేవలం 7 శాతంగానే ఉండగా.. అంతకుమించి ప్రదర్శన చేసింది. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా తగ్గుతూ వస్తోంది. అక్టోబర్ నెలలో 0.25 శాతంగానే నమోదైంది. ఇది జీవన కాల కనిష్ట స్థాయి అని చెప్పొచ్చు. ఆహార పదార్థాల ధరలు తగ్గడం, జీఎస్టీ రేట్ల కోత వంటివి దీనికి దోహదం చేశాయి. ఈ క్రమంలోనే ఆర్బీఐ గవర్నర్.. వడ్డీ రేట్ల కోత గురించి కొద్ది రోజుల ముందే సంకేతాలు కూడా ఇచ్చారు.