RBI New Rules : లోన్ రికవరీ ఏజెంట్లకు షాక్ ఇచ్చిన RBI ..జులై 1 నుంచి కొత్త రూల్స్
ఒకవేళ ఏజెంట్లు ఈ నియమాలను అతిక్రమిస్తే, బాధితులు ముందుగా సదరు బ్యాంకులోని గ్రీవెన్స్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. అక్కడ న్యాయం జరగకపోతే ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించవచ్చు లేదా బెదిరింపులు తీవ్రంగా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేసే హక్కు కల్పించారు
- Author : Sudheer
Date : 13-02-2026 - 10:25 IST
Published By : Hashtagu Telugu Desk
RBI New Rules : బ్యాంకు రుణాలు తీసుకున్న సామాన్యులను వేధింపులకు గురిచేస్తున్న రికవరీ ఏజెంట్ల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రుణ రికవరీ ప్రక్రియలో మానవీయ కోణాన్ని జోడిస్తూ, పారదర్శకతను పెంచే లక్ష్యంతో కొత్త ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది.
రుణం తీసుకున్న వారితో రికవరీ ఏజెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించే రోజులకు ఇక ముగింపు పడనుంది. కొత్త రూల్స్ ప్రకారం, ప్రతి రికవరీ ఏజెంట్ తప్పనిసరిగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (IIBF) ద్వారా శిక్షణ పొంది, సర్టిఫికేట్ సాధించాలి. కస్టమర్లతో అసభ్యకరంగా మాట్లాడటం, బెదిరింపులకు పాల్పడటం వంటివి చేస్తే సదరు ఏజెంట్లు మరియు బ్యాంకులపై కఠిన చర్యలు ఉంటాయి. ముఖ్యంగా, రికవరీ కోసం చేసే ప్రతి ఫోన్ కాల్‌ను బ్యాంకులు రికార్డ్ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. దీనివల్ల ఏజెంట్లు ఏ రకమైన పదజాలం వాడుతున్నారో నిశితంగా పర్యవేక్షించే అవకాశం కలుగుతుంది.
కొత్త నిబంధనల ప్రకారం, రికవరీ ఏజెంట్లు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేయడం లేదా ఇంటికి రావడం కుదరదు. కేవలం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య మాత్రమే రుణ గ్రహీతలను సంప్రదించాలి. అంతేకాకుండా, గ్రహీత ఇంట్లో ఏదైనా విషాదం జరిగినప్పుడు లేదా పెళ్లిళ్లు, పండుగలు ఉన్న సమయంలో రికవరీ కోసం వెళ్లకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. వ్యక్తిగత గోప్యతను కాపాడుతూ, కేవలం రుణ గ్రహీతతోనే మాట్లాడాలి తప్ప, వారి బంధువులను లేదా స్నేహితులను వేధించడం చట్టవిరుద్ధం. కస్టమర్ ఏదైనా ఫిర్యాదు చేస్తే, అది పరిష్కారమయ్యే వరకు ఆ లోన్ రికవరీ ప్రక్రియను ఏజెంట్లకు అప్పగించకూడదనే నిబంధన కస్టమర్లకు గొప్ప ఊరటనిస్తుంది.
ఒకవేళ ఏజెంట్లు ఈ నియమాలను అతిక్రమిస్తే, బాధితులు ముందుగా సదరు బ్యాంకులోని గ్రీవెన్స్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. అక్కడ న్యాయం జరగకపోతే ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించవచ్చు లేదా బెదిరింపులు తీవ్రంగా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేసే హక్కు కల్పించారు. ఈ ముసాయిదా నిబంధనలపై ప్రజలు 2026 మార్చి 6 వరకు తమ అభిప్రాయాలను తెలపవచ్చు. తుది పరిశీలన అనంతరం 2026, జులై 1 నుంచి ఈ కొత్త చట్టాలు దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. దీనివల్ల రుణ గ్రహీతలకు ఆత్మగౌరవంతో కూడిన రక్షణ లభించనుంది.