Ola Electric : ఓలా ఎలక్ట్రిక్ షేర్ రేటు డబుల్.. స్టాక్ మార్కెట్లో దూకుడు
ఇవాళ ఉదయం నుంచి ఇప్పటివరకు ఓలా ఎలక్ట్రిక్‌కు చెందిన దాదాపు 77.90 లక్షల షేర్లు చేతులు మారాయి.
- By Pasha Published Date - 12:32 PM, Mon - 19 August 24

Ola Electric : ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేరు ధర పైపైకి దూసుకుపోతోంది. దాని ధర ఇవాళ స్టాక్ మార్కెట్‌లో దాదాపు 10 శాతం పెరిగి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్‌ఈ)లో ఒకానొక దశలో రూ.146.03 రేంజులో ట్రేడ్ అయింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో కూడా ఈ షేరు ధర దాదాపు 10 శాతం పెరిగి రూ.146.38 స్థాయిని టచ్ చేసింది. ఈ లెక్కన రెండు స్టాక్ ఎక్స్ఛేంజీలలోనూ ఓలా ఎలక్ట్రిక్(Ola Electric) షేరు ధర అప్పర్ ప్రైస్ బ్యాండ్‌ను తాకింది. ఐపీఓ టైంలో ఎన్‌ఎస్‌ఈలో కేవలం రూ.76 ధరకు స్టాక్ మార్కెట్‌లో ఓలా లిస్టింగ్ అయింది. ఇప్పుడు దాని రేటు దాదాపు రెట్టింపు రేంజులో కదలాడుతుండటం గమనార్హం.
We’re now on WhatsApp. Click to Join
ఇవాళ ఉదయం నుంచి ఇప్పటివరకు ఓలా ఎలక్ట్రిక్‌కు చెందిన దాదాపు 77.90 లక్షల షేర్లు చేతులు మారాయి. దీంతో ఆ కంపెనీకి సంబంధించిన షేర్ల టర్నోవర్ విలువ దాదాపు రూ.111.21 కోట్లకు చేరింది. ఇవాళ ఇప్పటివరకు ఎన్‌ఎస్‌ఈలో ఈ కంపెనీకి చెందిన 977.51 లక్షల షేర్లు ట్రేడ్ అయ్యాయి. బీఎస్‌ఈ లెక్కల ప్రకారం ఓలా మార్కెట్ విలువ రూ.64,411 కోట్లకు చేరింది. ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజీ కంపెనీలు ఓలా ఎలక్ట్రిక్ షేరును ఇవాళ కొనొచ్చని సలహా ఇచ్చాయి. అయితే ఆ షేరకు రూ.140 టార్గెట్‌తో పనిచేయాలని సూచించాయి. వాస్తవానికి ఓలా ఎలక్ట్రిక్‌కు జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో రూ. 347 కోట్ల మేర నికర నష్టాలు వచ్చాయి. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే నికర నష్టాలు 30 శాతం పెరిగాయి.
విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ షేర్లు లిస్టింగ్ అయినప్పటి నుంచి బుల్ రన్‌లోనే ఉన్నాయి. తాజాగా విద్యుత్ వాహన విభాగంలో కొత్తగా మోటార్ సైకిళ్లను కూడా ఈ కంపెనీ విడుదల చేసింది. దీంతో మార్కెట్‌లోకి సానుకూల సంకేతాలు వచ్చాయి. కంపెనీకి మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆశతో అందులో భారీ ట్రేడింగ్ జరుగుతోంది.