New UPI Rules : ఆగస్టు 1 నుంచి కొత్త యూపీఐ రూల్స్.. తప్పక తెలుసుకోండి
ఈ రూల్స్‌ను ఇప్పటికే బ్యాంకులు, ఫోన్‌పే, గూగుల్ పే లాంటి పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు NPCI(New UPI Rules) పంపింది.
- By Pasha Published Date - 11:30 AM, Tue - 27 May 25

New UPI Rules: మీరు యూపీఐను వాడుతున్నారా ? యూపీఐ యాప్‌లతో లావాదేవీలను చేస్తున్నారా ? అయితే ఈ అలర్ట్‌ను తెలుసుకోండి. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి యూపీఐ రూల్స్‌లో కీలక మార్పులు జరగబోతున్నాయని గుర్తుంచుకోండి. ఆ వివరాలు తెలియాలంటే ఈ కథనాన్ని చదవండి.
ఆగస్టు 1 నుంచి యూపీఐ కొత్త రూల్స్ ఇవీ..
- యూపీఐ (UPI) లావాదేవీల వ్యవస్థను కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కంట్రోల్ చేస్తుంది.
- NPCI ఆగస్టు 1 నుంచి కొత్త ఏపీఐ (API) నియమాలను యూపీఐ సేవల్లో అమలు చేయనుంది. దీనివల్ల యూపీఐ వినియోగదారులు ప్రస్తుతం పొందుతున్న కొన్ని సౌకర్యాలపై పరిమితులు అమల్లోకి వస్తాయి.
- ఈ రూల్స్‌ను ఇప్పటికే బ్యాంకులు, ఫోన్‌పే, గూగుల్ పే లాంటి పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు NPCI(New UPI Rules) పంపింది.
- కొత్త రూల్స్ ప్రకారం ఆగస్టు 1 నుంచి యూజర్లు ఒక రోజులో ఒకే యూపీఐ యాప్ నుంచి గరిష్టంగా 50 సార్లు మాత్రమే బ్యాంక్ బ్యాలెన్స్‌ను చెక్ చేయగలరు.
- రెండు యూపీఐ యాప్‌లు వాడుతున్న వారు, ప్రతి యాప్ నుంచి విడివిడిగా 50 సార్లు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
- ఆటోపే ద్వారా జరిగే చెల్లింపులకు ఆగస్టు 1 నుంచి టైం రిస్ట్రిక్షన్స్ అమల్లోకి వస్తాయి. పీక్ అవర్స్‌లో అంటే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు ఆటోపేమెంట్స్ జరగవు. ఆటోపేలు కేవలం నాన్-పీక్ అవర్స్‌లో మాత్రమే ప్రాసెస్ అవుతాయి.
- ఈ మార్పు వల్ల యూపీఐ యూజర్ల ఆటోపేమెంట్ షెడ్యూల్‌లో ఆలస్యం జరగొచ్చు. దీనివల్ల నెలవారీ బిల్లులు, సబ్‌స్క్రిప్షన్ పేమెంట్లలో జాప్యం జరగొచ్చు.
- నెట్‌వర్క్ సమస్య వంటి నిర్దిష్ట లోపాల వల్ల ఏదైనా లావాదేవీ ఫెయిలైతే, దాని స్టేటస్‌ను పదే పదే చెక్ చేయడానికి వీలుండదు. దీనివల్ల యూజర్లకు కొంత గందరగోళం ఏర్పడొచ్చు.
- యూజర్లు తమ ఫోన్ నంబరుకు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ల లిస్టును ఒక యాప్ నుంచి ఒక రోజులో 25 సార్లే చెక్ చేసుకోగలరు.