Rent Agreement Rules 2025 : అద్దెకు ఉండేవారిపై కొత్త రూల్స్.. రూ.1 లక్ష ఫైన్..7 ఏళ్ల జైలు?
- By Vamsi Chowdary Korata Published Date - 02:43 PM, Mon - 1 December 25
ఉపాధి నిమిత్తం నగరాలకు వెళ్లి అద్దెకు ఉంటున్నారా? వ్యాపార నిమిత్తం ఏదైనా ప్రాపర్టీని అద్దెకు తీసుకుంటున్నారా? అయితే మీరు మారిన రెంట్ అగ్రిమెంట్ రూల్స్ 2025 కచ్చితంగా తెలుసుకోవాలి. ఇంటి అద్దె లిమిట్ దాటి ఉన్నప్పుడు టీడీఎస్ 2 శాతం కచ్చితంగా మినహాయించాల్సి ఉంటుంది. దానిని ప్రభుత్వానికి జమ చేయాలి. లేదంటే భారీగా పెనాల్టీలు పడతాయి. గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు పెనాల్టీ పడే అవకాశం ఉంది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఉద్యోగం కోసం సిటీలకు మారుతున్నారు. దీంతో అద్దెకు ఉండాల్సి ఉంటుంది. కానీ, చాలా మందికి రెంట్ అగ్రిమెంట్ రూల్స్ గురించి పూర్తి అవగాహన ఉండదు. దీంతో ఇబ్బందులు పడుతుంటారు. ఇంటి యజమానులు సైతం సరిగా చెప్పకుండా నోటి మాటతోనే ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా ఇల్లు ఇస్తుంటారు. దీంతో కొన్నిసార్లు ఆదాయపు పన్ను చిక్కులు ఎదురవుతాయి. రెంటుకు ఉండే వారికి సైతం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హక్కులు కల్పించింది. అద్దెకు ఉండే వారికి ఊరట కల్పిస్తూ తాజాగా కొత్త రెంట్ అగ్రిమెంట్ రూల్స్ 2025 అమలులోకి తీసుకొచ్చింది. అద్దెకు ఉండే వారికి జీవనాన్ని సులభతరం చేయడం, పారదర్శకత, ఆదాయపు పన్ను చిక్కులను సులభతరం చేయడం వంటివి జరగుతాయని కేంద్రం చెబుతోంది.
కొత్త రెంట్ అగ్రిమెంట్ రూల్స్ ప్రకారం.. 60 రోజుల్లోపు ఆన్‌లైన్ ద్వారా రెంట్ అగ్రిమెంట్ చేయించి డిజిటల్ స్టాంప్ చేయించడం తప్పనిసరి. అలాగే సెక్యూరిటీ డిపాజిట్ ఇంటి కోసం అయితే రెండు నెలలు, వాణిజ్య సముదాయం అయితే 6 నెలల వరకు గరిష్ఠంగా తీసుకోవచ్చు. చేరిన 12 నెలల వరకు రెంటు పెంచేందుకు వీలుండదు. అలాగే ఇంట్లో ఏవైనా రిపేర్లు ఉంటే నెల రోజుల్లోగా యజమాని మరమ్మతు చేయించాల్సి ఉంటుంది. ఇలా పలు కొత్త నిబంధనలను కేంద్రం తీసుకొచ్చింది. అలాగే పన్నులకు సంబంధించి సైతం క్లారిటీ ఇచ్చింది.