Personal Finance Changes: మీపై వ్యక్తిగతంగా ప్రభావం చూపే.. కేంద్ర బడ్జెట్‌లోని పన్ను మార్పులివే
అవి మనలో చాలామందిపై ఆర్థికంగా ప్రభావాన్ని(Personal Finance Changes) చూపిస్తాయి.
- By Pasha Published Date - 02:23 PM, Wed - 12 February 25

Personal Finance Changes: పర్సనల్ ఫైనాన్స్.. ఇది అందరికీ చాలా కీలకమైన అంశం. పర్సనల్ ఫైనాన్స్‌లోకి ఆదాయపు పన్ను, పొదుపు పథకాలు, టీడీఎస్, విదేశీ ఆదాయం, అదనపు ఆదాయం, పెట్టుబడులు వంటివన్నీ వస్తాయి. ఇలాంటి అంశాల్లో ఈసారి కేంద్ర బడ్జెట్‌లో పలు కీలక మార్పులు, సవరణలు చేశారు. అవి మనలో చాలామందిపై ఆర్థికంగా ప్రభావాన్ని(Personal Finance Changes) చూపిస్తాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :CM Phone Call : చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఒక ఫోన్ కాల్.. అసలేం జరిగింది ?
‘యూనిట్ లింక్డ్ బీమా పథకాల’లో మార్పు
‘యూనిట్ లింక్డ్ బీమా పథకాలు’ (ULIPs) లాంగ్ టర్మ్‌లో బాగా పనికొస్తాయి. వీటిలో కనీసం ఐదేళ్లు పెట్టుబడి పెట్టాలి. బీమా ప్రయోజనాలతో పాటు పెట్టుబడి ప్రయోజనాలను అందించడం వీటి ప్రత్యేకత. ఒక్కో బీమా కంపెనీ ఒక్కో విధమైన యులిప్ స్కీంలను అందిస్తుంటుంది. ఏదైనా యులిప్ స్కీం వార్షిక ప్రీమియం రూ.2.50 లక్షలకు మించి ఉండి, దాని నుంచి అకస్మాత్తుగా వైదొలగితే ఇకపై మూలధన లాభాల పన్ను విధిస్తారు. కనీసం ఏడాదికిపైగా వ్యవధిని పూర్తి చేసుకునే యులిప్‌లను ఈక్విటీ ఆధారిత మూచువల్ ఫండ్లు, షేర్లుగా పరిగణిస్తారు. వాటిపై 12.5 శాతం మేర మూలధన లాభాల పన్నును విధిస్తారు. ఇంతకుముందు వరకు యులిప్ పాలసీని అకస్మాత్తుగా సరెండర్ చేసినా ఎలాంటి పన్నులూ విధించేవారు కాదు.
ఐటీఆర్ గడువులో మార్పు
అప్‌డేటెడ్ ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) సమర్పణ గడువును రెండేళ్ల నుంచి నాలుగేళ్లకు పెంచారు. దీనికి సంబంధించిన ఐటీ రీఫండ్‌లకు క్లెయిమ్‌ల దాఖలుపై పలు పరిమితులు విధించారు. ఇలాంటప్పుడు చెల్లించాల్సిన ఆదాయపు పన్నులో దాదాపు 60 శాతం నుంచి 70 శాతంతో పాటు అదనపు ఆదాయంపై వడ్డీని కలిపి కట్టాలనే నిబంధనను తీసుకొచ్చారు. మదింపు సంవత్సరం (అసెస్‌మెంట్ ఈయర్)లో అప్‌డేటెడ్ ఐటీఆర్‌ను ఎప్పుడు సమర్పిస్తున్నారనే దాని ఆధారంగా ఈ పన్నులు నిర్ణయిస్తారు.
Also Read :Delhi CM Race: ఢిల్లీ సీఎంగా యోగి లాంటి లీడర్.. ఎందుకు ?
ఎన్‌పీఎస్ వాత్సల్య స్కీంతో అదనపు లబ్ధి
‘నేషనల్ పెన్షన్ సిస్టమ్ వాత్సల్య స్కీం’ను బాలలు, ఇతరులపై ఆధారపడి జీవించేవారు, దివ్యాంగుల కోసం తీసుకొచ్చారు. సాధారణ ‘నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీం’ ద్వారా ఎంతైతే పన్ను మినహాయింపులను పొందుతామో.. అంతే మినహాయింపులను ఇకపై వాత్సల్య స్కీం ద్వారా పొందొచ్చు. దీన్ని వాడుకొని పేరెంట్స్, గార్డియన్లు రూ.50వేల దాకా అదనపు పన్ను మినహాయింపులను పొందొచ్చు.
టీడీఎస్ పరిమితుల్లో మార్పు
టీడీఎస్ అంటే మూలం వద్ద పన్ను మినహాయింపు. సీనియర్ సిటిజెన్లు సంపాదించే వడ్డీ ఆదాయంపై విధించే టీడీఎస్ పరిమితిని రూ.1 లక్షకు పెంచారు. ఇతర వయస్కుల విషయంలో ఈ పరిమితిని రూ.50వేలకు పెంచారు. అద్దెలపై విధించే టీడీఎస్ పరిమితిని వార్షికంగా రూ.6 లక్షలకు పెంచారు. డివిడెండ్ ఆదాయంపై టీడీఎస్ పరిమితిని రూ.10వేలకు పెంచారు.
టీసీఎస్ పరిమితిలో మార్పు
టీసీఎస్ అంటే మూలం వద్ద పన్ను వసూళ్లు. మన దేశానికి చెందిన ఎంతోమంది విదేశాల్లో జాబ్స్ చేస్తారు. వారు మన దేశానికి పంపే డబ్బులపై టీసీఎస్‌ను వసూలు చేస్తారు. దీని పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని బడ్జెట్‌లో ప్రపోజ్ చేశారు.
నేషనల్ సేవింగ్స్ స్కీంలో బెనిఫిట్
నేషనల్ సేవింగ్స్ స్కీంలలో చాలామంది డబ్బులను పొదుపు చేస్తుంటారు. 2024 ఆగస్టు 29వ తేదీన, ఆ తర్వాత నేషనల్ సేవింగ్స్ స్కీంలో చేరిన వారు ఒకవేళ డబ్బులను విత్‌డ్రా చేసుకుంటే ఇకపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.