Labor Ministry: ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్‌కు భారీ షాక్.. వివరణ ఇవ్వాలని కోరిన కేంద్రం!
12,000 మంది ఉద్యోగులను తొలగించడం. అలాగే 600 మంది కొత్త నియామకాలను నిలిపివేయడంపై NITES అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ఉద్యోగుల పట్ల అనైతిక, అమానుషమైన చర్య అని పేర్కొంది.
- By Gopichand Published Date - 08:42 PM, Wed - 30 July 25

Labor Ministry: ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించాలన్న నిర్ణయం, కొత్త నియామకాలను ఆలస్యం చేయాలన్న వ్యవహారాన్ని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ (Labor Ministry) సీరియస్‌గా తీసుకుంది. ఈ విషయాలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ ఆగస్టు 1న విచారణకు హాజరు కావాలని టీసీఎస్‌కు సమన్లు జారీ చేసింది.
ఎవరు ఫిర్యాదు చేశారు?
‘నేసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనెట్ (NITES)’ అనే ఐటీ ఉద్యోగుల సంఘం చీఫ్ లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది.
ఎందుకు ఫిర్యాదు చేశారు?
12,000 మంది ఉద్యోగులను తొలగించడం. అలాగే 600 మంది కొత్త నియామకాలను నిలిపివేయడంపై NITES అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ఉద్యోగుల పట్ల అనైతిక, అమానుషమైన చర్య అని పేర్కొంది. ఈ ఫిర్యాదు ఆధారంగా కార్మిక మంత్రిత్వ శాఖ టీసీఎస్‌ను ఆగస్టు 1న హాజరై, ఈ రెండు అంశాలపై వివరణాత్మక నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
Also Read: GSLV-F16: జీఎస్ఎల్‌వీ- ఎఫ్16 రాకెట్ ప్రయోగం విజయవంతం.. పూర్తి వివరాలీవే!
నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు
NITES సంస్థ ప్రకారం.. టీసీఎస్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియలో చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించింది. ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులను తొలగించే ముందు, ఒక నెల నోటీసు లేదా దానికి బదులుగా వేతనం, చట్టబద్ధమైన తొలగింపు పరిహారం చెల్లించడం, ప్రభుత్వానికి సమాచారం అందించడం తప్పనిసరి. అయితే, టీసీఎస్ ఈ నిబంధనలలో ఏ ఒక్కటి కూడా పాటించలేదని NITES ఆరోపించింది.
టీసీఎస్ వివరణ
ఈ తొలగింపుల నిర్ణయంపై టీసీఎస్ ఇప్పటికే స్పందించింది. భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉండటం కోసం, టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు (AI)ను స్వీకరించడం, మార్కెట్ విస్తరణ, కార్యబల పునర్‌వ్యవస్థీకరణ వంటి వ్యూహాత్మక నిర్ణయాలలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. తొలగించిన ఉద్యోగులకు తగిన ప్రయోజనాలు, కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడానికి సహాయం, సలహాలు, మద్దతు అందిస్తామని కూడా హామీ ఇచ్చింది.
NITES అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా ఈ తొలగింపులను “కార్పొరేట్ శబ్దజాలంలో దాగి ఉన్న సామూహిక తొలగింపు”గా అభివర్ణించారు. టీసీఎస్ వంటి పెద్ద సంస్థ సరైన ప్రక్రియ లేకుండా ఉద్యోగులను తొలగించడం పరిశ్రమకు ఒక ప్రమాదకర ఉదాహరణగా నిలుస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలని, తొలగింపులను నిలిపివేయాలని NITES కోరింది.