BSNL – MTNL : కీలక పరిణామం.. బీఎస్‌ఎన్‌ఎల్ పరిధిలోకి మరో టెలికాం సంస్థ !
మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL) కార్యకలాపాలను బీఎస్‌ఎన్‌ఎల్‌కు అప్పగించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
- By Pasha Published Date - 04:48 PM, Sat - 13 July 24

BSNL – MTNL : మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL) కార్యకలాపాలను బీఎస్‌ఎన్‌ఎల్‌కు అప్పగించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ అప్పగింత ప్రక్రియ పూర్తి కావడానికి ఇంకో నెల రోజుల టైం పడుతుందని అంచనా వేస్తున్నారు. తొలుత కేంద్ర క్యాబినెట్ సెక్రటరీల కమిటీ ఎదుట దీనికి సంబంధించిన ప్రతిపాదనను ఉంచి.. తదుపరిగా కేంద్ర కేబినెట్ ఆమోదానికి పంపిస్తారని తెలుస్తోంది. ఈ పరిణామంతో ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్‌ఎల్‌ల విలీనం జరగదనే స్పష్టమైన సంకేతం వెలువడింది. ఆ రెండు సంస్థల(BSNL – MTNL) విలీనం విషయంలో కేంద్రం పునరాలోచనలో పడిందని పరిశీలకులు అంటున్నారు. అప్పుల ఊబిలో ఉన్న ఎంటీఎన్‌ఎల్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌లో విలీనం చేయడం కరెక్టు కాదని కేంద్రం భావిస్తోందట. అందుకే ఎంటీఎన్‌ఎల్ కార్యకలాపాలను బీఎస్ఎన్‌ఎల్‌కు అప్పగించడంతో సరిపెట్టుకోవాలని సర్కారు అనుకుంటోందట.
We’re now on WhatsApp. Click to Join
ఎంటీఎన్‌ఎల్ అనేది మన దేశంలోని ఢిల్లీ, ముంబై నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఎంటీఎన్‌ఎల్‌కు భారీగా అప్పులు ఉన్నాయి. ఈ ఏడాది జులై 20వ తేదీ నాటికి బాండ్ హోల్డర్లకు వడ్డీలు కట్టేందుకు నిధులు లేక ఎంటీఎన్ఎల్ అల్లాడుతోంది. 2023-24 జనవరి-మార్చిలో 46 లక్షల మంది (వైర్, వైర్‌లెస్) వినియోగదారులు ఎంటీఎన్‌ఎల్‌కు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 41 లక్షలకు తగ్గింది. ఇక ఇదే సమయంలో కంపెనీ నష్టాలు రూ.2,915 కోట్ల నుంచి రూ.3,267 కోట్లకు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎంటీఎన్ఎల్ ఆదాయం కూడా తగ్గిపోయి రూ.798.56 కోట్లకు చేరింది. అందుకే ఓ ఒప్పందం ద్వారా ఎంటీఎన్ఎల్ కార్యకలాపాల బాధ్యతను బీఎస్ఎన్ఎల్‌కు(BSNL) అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది.
Also Read :PM Modi: ముంబైలో 29,400 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన
బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా మరో రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. 35 రోజుల కాలపరిమితితో రూ.107 కనీస రీచార్జి ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద 200 నిమిషాలు ఏ నెట్‌వర్క్‌కైనా మాట్లాడుకోవచ్చు. 3జీబీ డాటాను వాడుకోవచ్చు. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా అందిస్తున్న ప్లాన్ల కంటే ఇదే చౌకది. దీంతో కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన నగరాల్లో 4జీ సేవలను బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా 4జీ సేవలను బీఎస్ఎన్ఎల్ అందించనుంది.