Burger Singh: బర్గర్ ప్రియులకు గుడ్ న్యూస్..హైదరాబాద్ లో బర్గర్ సింగ్ రెస్టారెంట్ ప్రారంభం
- Author : Vamsi Chowdary Korata
Date : 18-07-2026 - 10:51 IST
Published By : Hashtagu Telugu Desk
Burger Singh : భారతదేశపు అతిపెద్ద స్వదేశీ బర్గర్ బ్రాండ్ ‘బర్గర్ సింగ్’ (Burger Singh) మళ్లీ హైదరాబాద్ మార్కెట్లోకి అత్యంత ప్రతిష్టాత్మకంగా అడుగుపెట్టింది. కోవిడ్ మహమ్మారి కంటే ముందు నగరంలో విజయవంతంగా నడిచిన ఈ బ్రాండ్.. తాత్కాలిక విరామం తర్వాత ఇప్పుడు మరింత పటిష్టమైన విస్తరణ ప్రణాళికలతో రీ-ఎంట్రీ ఇచ్చింది. దేశంలోనే మొట్టమొదటి ఫ్రాంచైజీ-ఆధారిత రెస్టారెంట్ వృద్ధి వేదికను నిర్మించే లక్ష్యంతో ఇటీవల సిరీస్-బి ఫండింగ్ ద్వారా రూ. 82 కోట్ల నిధులను సమీకరించిన సంస్థ, ఆ పెట్టుబడులతో దేశవ్యాప్తంగా తన ఉనికిని చాటుతోంది. ఇందులో భాగంగానే దక్షిణ భారతదేశంలో తన నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు హైదరాబాద్‌ను ప్రధాన కేంద్రంగా ఎంచుకుంది. రాబోయే రోజుల్లో ఒక్క హైదరాబాద్ నగరంలోనే 30 అవుట్లెట్లను, అలాగే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 60 అవుట్లెట్లను ప్రారంభించడమే లక్ష్యంగా ఈ ‘మేడ్-ఇన్-ఇండియా’ ఫుడ్ చైన్ అడుగులు వేస్తోంది.
హైటెక్ సిటీలో తొలి స్టోర్ ప్రారంభం
ఈ భారీ విస్తరణలో భాగంగా హైదరాబాద్ ఐటీ హబ్ అయిన హైటెక్ సిటీలో (Hi-Tech City) బర్గర్ సింగ్ తన మొదటి సరికొత్త అవుట్‌లెట్‌ను అధికారికంగా ప్రారంభించింది. పాశ్చాత్య బర్గర్ ఆకృతికి అచ్చమైన భారతీయ మసాలాలు, రుచులను జోడించి వినూత్నమైన ఫ్యూజన్ వంటకాలను అందించడం ఈ బ్రాండ్ ప్రత్యేకత. ఈ అవుట్‌లెట్‌లో వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకునే ‘నిక్కు సింగ్’, ‘చుర్ముర్ పాండే’, ‘ఉడ్తా పంజాబ్ 2.0’, మరియు ‘చంకీ పనీర్ పాండే’ వంటి నోరూరించే సిగ్నేచర్ బర్గర్లు అందుబాటు ధరల్లో లభించనున్నాయి. స్థానిక పారిశ్రామికవేత్తలకు భాగస్వామ్యం కల్పిస్తూ, పటిష్టమైన ఫ్రాంచైజీ మోడల్ ద్వారా వేగంగా దూసుకుపోతున్న ఈ భారతీయ విజయగాథలో భాగస్వాములు కావాలని ఔత్సాహిక వ్యాపారవేత్తలను బర్గర్ సింగ్ సహ వ్యవస్థాపకుడు నితిన్ రాణా ఈ సందర్భంగా ఆహ్వానించారు.