ట్రంప్ దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు
రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపకపోతే భారత్‌పై టారిఫ్స్‌ను మరింత పెంచుతామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించింది.
- Author : Sudheer
Date : 06-01-2026 - 8:50 IST
Published By : Hashtagu Telugu Desk
అంతర్జాతీయ రాజకీయాల్లో నెలకొన్న అస్థిరత మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వెనిజులాపై అమెరికా మెరుపు దాడులు చేయడం, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించడం వంటి పరిణామాలు ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేశాయి. ఈ చర్యను చైనా వంటి దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో యుద్ధ వాతావరణం నెలకొంది. దీనికి తోడు, రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపకపోతే భారత్‌పై టారిఫ్స్‌ను మరింత పెంచుతామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించింది. ఇప్పటికే భారత్‌పై దిగుమతి సుంకాలను 50 శాతానికి పెంచిన ట్రంప్, మళ్ళీ హెచ్చరికలు జారీ చేయడంతో రూపాయి విలువ పడిపోయి, డాలరుతో పోలిస్తే రూ. 90.28 వద్దకు చేరింది.ఇలాంటి అనిశ్చితి సమయాల్లో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ల కంటే సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతారు.

Trump Effect Gold Price
దీంతో అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,320 డాలర్ల నుంచి ఒక్కసారిగా 4,450 డాలర్ల మార్కును దాటేసింది. కేవలం ఒక్క రోజులోనే 120 డాలర్లకు పైగా పెరగడం గమనార్హం. వెండి కూడా ఔన్సుకు 77 డాలర్ల స్థాయికి చేరుకుంది. గత ఏడాది చివరలో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై అంచనాలతో కాస్త తగ్గుముఖం పట్టిన లోహాల ధరలు, కొత్త ఏడాది ఆరంభంలోనే ట్రంప్ తీసుకున్న భౌగోళిక రాజకీయ నిర్ణయాల వల్ల మళ్లీ గరిష్ఠాల దిశగా పరుగులు పెడుతున్నాయి.
హైదరాబాద్ మార్కెట్లో నేటి ధరలు చూస్తే, 22 క్యారెట్ల బంగారం (10 గ్రా) రూ. 1,26,700 , రూ. 2,20024 క్యారెట్ల బంగారం (10 గ్రా)రూ. 1,38,220 , రూ. 2,400వెండి (1 కేజీ) రూ. 2,65,000 , రూ. 8,000 స్థానిక మార్కెట్లలో కూడా ఈ ప్రభావం భారీగా కనిపిస్తోంది. హైదరాబాద్‌లో ఒక్క రోజులోనే తులం బంగారంపై సుమారు రూ. 2,400 వరకు పెరగడం సామాన్యులను షాక్‌కు గురిచేస్తోంది. వెండి ధర కూడా కిలోకు రూ. 8,000 పెరిగి రూ. 2.65 లక్షల వద్ద ట్రేడవుతోంది. గత డిసెంబర్ చివరిలో వెండి ధరలు కొంత మేర తగ్గినప్పటికీ, తాజా అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మళ్లీ ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయి అయిన రూ. 2.85 లక్షల దిశగా పయనిస్తున్నాయి. అమెరికా-భారత్ మధ్య టారిఫ్స్ వివాదం ముదిరితే, దిగుమతి ఖర్చులు పెరిగి దేశీయంగా పసిడి ధరలు మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.