EPFO 3.0: దీపావళికి ముందే శుభవార్త.. పీఎఫ్ ఉపసంహరణ ఇక సులభతరం!
ఈ పోర్టల్ ప్రారంభం వెనుక ప్రధాన ఉద్దేశ్యం పీఎఫ్ డబ్బు ఉపసంహరణను బ్యాంకులలో డబ్బు తీసినంత సులభంగా మార్చడం, ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటల్, పేపర్‌లెస్ చేయడం, అలాగే పీఎఫ్ వ్యవస్థను మొత్తం పని విధానంతో అనుసంధానించడం.
- By Gopichand Published Date - 02:55 PM, Sun - 21 September 25

EPFO 3.0: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO 3.0) తన 8 కోట్ల ఖాతాదారుల కోసం EPFO 3.0 పోర్టల్‌ను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఈ పోర్టల్ దీపావళికి ముందుగా ప్రారంభించబడవచ్చు. వాస్తవానికి ఈ పోర్టల్‌ను జూన్ 2025లోనే ప్రారంభించాలనుకున్నారు. కానీ సాంకేతిక సమస్యల వల్ల అది సాధ్యం కాలేదు. ఇప్పుడు అక్టోబర్ 10, 11 తేదీల్లో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన జరిగే సమావేశంలో దీని ప్రారంభ తేదీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఉద్దేశ్యం- ప్రయోజనాలు
EPFO 3.0 పోర్టల్ EPFOను ‘బ్యాంకింగ్ తరహా’ సంస్థగా మారుస్తుంది. ఈ పోర్టల్ ప్రారంభం వెనుక ప్రధాన ఉద్దేశ్యం పీఎఫ్ డబ్బు ఉపసంహరణను బ్యాంకులలో డబ్బు తీసినంత సులభంగా మార్చడం, ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటల్, పేపర్‌లెస్ చేయడం, అలాగే పీఎఫ్ వ్యవస్థను మొత్తం పని విధానంతో అనుసంధానించడం. ఈ పోర్టల్‌లో కూడా UAN నంబర్ ద్వారా లాగిన్ అవ్వడం, UANను ఆధార్, పాన్ కార్డులతో లింక్ చేయడం తప్పనిసరి. ఈ పోర్టల్ ప్రారంభమైన తర్వాత ప్రజలు తమ ఏటీఎం లేదా యూపీఐ పిన్‌లను చోరీ కాకుండా చూసుకోవాలి. అలాగే స్కిమ్మింగ్ డివైస్‌ల పట్ల జాగ్రత్తగా ఉండి, తమ పదవీ విరమణ పొదుపును కాపాడుకోవాలి.
పోర్టల్ ద్వారా డబ్బు ఎలా ఉపసంహరించుకోవాలి?
EPFO 3.0 పోర్టల్ ప్రారంభమయ్యాక పీఎఫ్ ఉపసంహరణ ప్రక్రియ పూర్తిగా మారిపోతుంది. పీఎఫ్ ఖాతా యూపీఐ, ఏటీఎం నెట్‌వర్క్‌తో అనుసంధానమవుతుంది. దీనివల్ల పీఎఫ్ డబ్బును ఉపసంహరించుకోవడానికి ఇక ఎలాంటి ఫారమ్ పూరించాల్సిన అవసరం ఉండదు. అలాగే ఎలాంటి పత్రాలు అవసరం లేదు. EPFO కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు మీ మొబైల్‌లో యూపీఐ యాప్ లేదా ఉమంగ్ యాప్ ద్వారా డబ్బును బదిలీ చేసుకోవచ్చు లేదా బ్యాంక్ ఏటీఎంకు వెళ్లి డబ్బు తీసుకోవచ్చు.
Also Read: PM Modi: ఈరోజు ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోదీ..!
ఈ పోర్టల్ ద్వారా పొందే ఓవరాల్ ప్రయోజనాలు
ఏటీఎం ద్వారా పీఎఫ్ ఉపసంహరణ: ఈ పోర్టల్ ద్వారా ఏటీఎం నుండి పీఎఫ్ డబ్బును తీసుకోవడం సాధ్యమవుతుంది.
తక్షణ నిధుల లభ్యత: అత్యవసర పరిస్థితుల్లో రూ. లక్ష వరకు ఉపసంహరించుకోవచ్చు. పీఎఫ్ క్లెయిమ్ సెటిల్ కావడానికి 7 నుండి 10 రోజుల వరకు వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ఫోన్‌పే, గూగుల్‌పే వంటి వాటి ద్వారా డబ్బు తక్షణమే బదిలీ అవుతుంది. తద్వారా పీఎఫ్ వ్యవస్థ డిజిటల్ ట్రాన్సాక్షన్ సిస్టమ్‌తో అనుసంధానమవుతుంది.
ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్: క్లెయిమ్ సెటిల్‌మెంట్ ఆటోమేటిక్‌గా, ఆన్‌లైన్‌లో జరుగుతుంది.
ఆన్‌లైన్ అప్‌డేట్లు: పీఎఫ్ ఖాతాలో పేరు, పుట్టిన తేదీ, బ్యాంక్ వివరాలు వంటివి ఓటీపీ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు,.ఎలాంటి ఫారమ్ పూరించనవసరం లేదు.
సులభమైన బ్యాలెన్స్ వీక్షణ: పాస్‌బుక్ లైట్, ఉమంగ్ యాప్ లేదా EPFO 3.0 పోర్టల్‌లో ఉపసంహరణలు, బ్యాలెన్స్ గ్రాఫికల్ రూపంలో చూడవచ్చు.
సామాజిక భద్రతా పథకాల అనుసంధానం: ఈ పోర్టల్ అటల్ పెన్షన్ యోజన, పీఎం జీవన్ బీమా యోజన వంటి వాటితో లింక్ అవుతుంది. భవిష్యత్తులో ఆయుష్మాన్ భారత్ యోజనతో కూడా అనుసంధానం కావచ్చు.
తక్కువ మోసం రిస్క్: ఓటీపీ ద్వారా ధృవీకరణ, కేవైసీ, డబ్బు ఉపసంహరణ వంటివి ఆన్‌లైన్‌లో జరగడం వల్ల మోసాలు తగ్గుతాయి.