BSNL : బీఎస్‌ఎన్‌ఎలా మజాకా..సిమ్ కార్డు లేకుండానే కాల్స్ చేసుకోవచ్చు
BSNL : డైరెక్ట్ టూ డివైజ్ (D2D) సాంకేతికత ద్వారా సిమ్ కార్డు లేకుండా, మొబైల్ నెట్‌వర్క్ అవసరం లేకుండా కాల్స్, మెసేజ్‌లు పంపుకునే అవకాశాన్ని కల్పించనుంది
- By Sudheer Published Date - 03:34 PM, Wed - 19 February 25

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కొత్త ఆవిష్కరణలతో టెలికాం రంగంలో మరింత ముందుకు సాగుతోంది. తాజాగా డైరెక్ట్ టూ డివైజ్ (D2D) సాంకేతికత ద్వారా సిమ్ కార్డు లేకుండా, మొబైల్ నెట్‌వర్క్ అవసరం లేకుండా కాల్స్, మెసేజ్‌లు పంపుకునే అవకాశాన్ని కల్పించనుంది. అమెరికాకు చెందిన వయాశాట్ కమ్యూనికేషన్స్‌తో కలిసి BSNL ఈ సేవలను అభివృద్ధి చేసింది. ఇటీవల ముగిసిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో BSNL కొత్త లోగోతో పాటు, 7 కొత్త సేవలను ప్రవేశపెట్టింది. వీటిలో D2D టెక్నాలజీ అత్యంత ప్రధానంగా నిలిచింది.
ఈ టెక్నాలజీ నాన్-టెర్రెస్ట్రియల్ నెట్‌వర్క్ (NTN) ఆధారంగా పనిచేస్తుంది. ఉపగ్రహాలను మొబైల్ టవర్లుగా ఉపయోగించడంతో, ఎక్కడైనా నెట్‌వర్క్ లేనప్పటికీ కాల్స్, మెసేజ్‌లు, UPI లావాదేవీలు చేయవచ్చు. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, సముద్ర ప్రాంతాలు, విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడనుంది. BSNL 4G సేవలను విస్తరించేందుకు, 5G సర్వీసులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రైవేట్ టెలికాం సంస్థలు రీఛార్జ్ రేట్లను భారీగా పెంచుతున్న నేపథ్యంలో, BSNL వినియోగదారుల్ని ఆకర్షించేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది.
VIP Number: వీఐపీ ఫోన్ నంబర్ కావాలా ? ఇదిగో కొత్త సిమ్
ఇప్పటికే BSNL స్పామ్ డిటెక్షన్, ఆటోమేటెడ్ సిమ్ కియోస్క్‌లు, వైఫై రోమింగ్, రియల్‌టైమ్ డిజాస్టర్ రెస్పాన్స్, సురక్షితమైన నెట్‌వర్క్ వంటి కొత్త సేవలను ప్రవేశపెట్టింది. ప్రధాన ప్రైవేట్ టెలికాం సంస్థలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా టారిఫ్‌లు పెంచినప్పటికీ BSNL కాల్ ఛార్జీలను పెంచే ఆలోచన లేదని సంస్థ సీఎండీ రాబర్ట్ రవి ప్రకటించారు. ఈ ఏడాదిలో 4G కమర్షియల్ సేవలను ప్రారంభించి, 5G కి మారేందుకు అవసరమైన సన్నాహాలు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం మీద మొన్నటివరకు BSNL అంటే కూడా మరచిపోయిన జనాలు..ఇప్పుడు BSNL బెస్ట్ అంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.