ATM Charges Hike: నేటి నుంచే ఏటీఎం ఛార్జీల పెంపు.. ఎంత ?
మనకు బ్యాంకు అకౌంటు కలిగిన ఏటీఎం(ATM Charges Hike) నుంచి ప్రతినెలా ఐదుసార్లు ఉచితంగా నగదును విత్ డ్రా చేసుకోవచ్చు.
- By Pasha Published Date - 09:08 AM, Thu - 1 May 25

ATM Charges Hike: ఈరోజు నుంచి ఏటీఎంకు వెళ్తే కాస్త జాగ్రత్త. ఏటీఎం కార్డు చేతిలో ఉంది కదా అని ఎడాపెడా ఏటీఎంలో వాడేయకండి. అలా వినియోగిస్తే మీపై అదనపు ఛార్జీల బాదుడు తప్పదు. ఎందుకంటే ఇవాళ్టి (మే 1) నుంచి ఏటీఎం నగదు విత్‌డ్రా ఛార్జీలు పెరగనున్నాయి. మన ఏటీఎం విత్‌డ్రాలు ఫ్రీ లిమిట్‌ను దాటితే.. ఆయా లావాదేవీలపై ఛార్జీలు పెరుగుతాయి. అంటే అదనపు ఛార్జీలు విధిస్తారు. వీటిలో ఏటీఎం కొనుగోలు, నిర్వహణ, ఇతర బ్యాంకుల కస్టమర్లకు సేవలను అందించడానికి అయ్యే ఖర్చు కూడా కలిసి ఉంటుంది.
Also Read :AP DGP : ఏపీ డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తా.. నేపథ్యమిదీ
ఫ్రీ లిమిట్ ఎంత ? కొత్త పెంపు ఎంత ?
మనకు బ్యాంకు అకౌంటు కలిగిన ఏటీఎం(ATM Charges Hike) నుంచి ప్రతినెలా ఐదుసార్లు ఉచితంగా నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. ఇక ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి ఉచిత లావాదేవీల లిమిట్ విషయానికొస్తే.. నాన్ మెట్రో నగరాల్లో ప్రతినెలా ఐదు ఏటీఎం ట్రాన్సాక్షన్లు ఫ్రీ. మెట్రో నగరాల్లో ప్రతినెలా మూడు ఏటీఎం ట్రాన్సాక్షన్లు ఫ్రీ. నగదు విత్ డ్రా, నగదు డిపాజిట్ చేయడం, బ్యాలెన్స్ చెక్ చేయడం, పిన్ మార్చడం వంటివన్నీ నెలవారీ ఉచిత లావాదేవీల కిందికే వస్తాయి. నెలవారీ ఉచిత లావాదేవీలను మించి ఏటీఎంను వినియోగిస్తే.. ఒక్కో లావాదేవీపై ఇకపై రూ.23 చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకుముందు వరకు ఈ ఛార్జీ రూ.21గా ఉండేది. అంటే అదనపు ఛార్జీని మునుపటి కంటే రూ.2 మేర పెంచారు. 2022 సంవత్సరం నుంచే ఏటీఎం అదనపు లావాదేవీలపై రూ.21 అదనపు ఛార్జీని వసూలు చేస్తున్నారు.
Also Read :Caste Census : కుల గణనపై కేంద్రం నిర్ణయం.. రాహుల్ చలువే : సీఎం రేవంత్
ఎవరిపై అధిక భారం ?
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) సిఫారసుల మేరకు ఏటీఎం అదనపు లావాదేవీల ఫీజులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పెంచింది. ఏటీఎంల నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, అధీకృత ఏటీఎం నెట్ వర్క్ ఆపరేటర్లు, కార్డు చెల్లింపు నెట్ వర్క్ ఆపరేటర్లు సహా అన్ని వాణిజ్య బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై ఆర్‌బీఐకు మొరపెట్టుకున్నాయి. దీంతో ఏటీఎం అదనపు లావాదేవీల ఛార్జీలను ఆర్బీఐ సవరించింది. లావాదేవీ రుసుముల పెరుగుదల చిన్న బ్యాంకుల కస్టమర్లపై ఎక్కువ ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే వాటికి తక్కువ సంఖ్యలో ఏటీఎంలు ఉంటాయి. దీంతో ఆయా బ్యాంకుల ఖాతాదారులు నగదు ఉపసంహరణ కోసం పెద్ద బ్యాంకుల ఏటీఎంలపై ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి కస్టమర్లు అధిక ఛార్జీలను భరించాల్సి ఉంటుంది.