AP DGP : ఏపీ డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తా.. నేపథ్యమిదీ
అయితే వీరిలో ఒకరిని డీజీపీగా(AP DGP) రాష్ట్ర ప్రభుత్వం నియమించొచ్చు.
- By Pasha Published Date - 08:21 AM, Thu - 1 May 25

AP DGP : ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్‌గా హరీశ్ కుమార్ గుప్తా నియమితులు కానున్నారు. ఆయనను త్వరలోనే పూర్తి స్థాయి నూతన డీజీపీగా నియమించనున్నారు. ప్రస్తుతం ఇంఛార్జి డీజీపీ హోదాలో హరీశ్ కుమార్ గుప్తా సేవలు అందిస్తున్నారు. ఏపీ డీజీపీ ఎంపికపై బుధవారం రోజు ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రతినిధి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌తో కూడిన ప్యానల్ ఈ అంశంపై చర్చించింది. ఏపీలో డీజీ హోదా కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లతో కూడిన జాబితాను రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్‌సీకి పంపింది. ఆ జాబితాలోని పేర్లపై సమావేశంలో చర్చించారు. చివరగా హరీశ్ కుమార్ గుప్తా, అంజనీ కుమార్, మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి పేర్లను ఎంపిక చేశారు. అయితే వీరిలో ఒకరిని డీజీపీగా(AP DGP) రాష్ట్ర ప్రభుత్వం నియమించొచ్చు.
Also Read :Caste Census : కుల గణనపై కేంద్రం నిర్ణయం.. రాహుల్ చలువే : సీఎం రేవంత్
సీనియారిటీ లెక్కలు ఇవీ..
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో హరీశ్ కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం తాత్కాలిక డీజీపీగా నియమించింది. దీంతో కొన్నిరోజుల పాటు ఆయన ఆ పోస్టులో కొనసాగారు.ఏపీలో కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత.. తిరుమలరావును డీజీపీగా నియమించింది. ఆయన పదవీ విరమణ చేశాక సీనియారిటీ జాబితాలో మొదటి స్థానంలో అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఉన్నారు. ఈయన 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. రెండో స్థానంలో హరీశ్ కుమార్ గుప్తా ఉన్నారు. ఈయన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. సీనియారిటీ పరంగా వెనుకంజలో ఉన్నప్పటికీ.. ఇంఛార్జి డీజీపీ పోస్టుకు ఈ ఏడాది జనవరిలో హరీశ్ కుమార్ గుప్తానే చంద్రబాబు ఎంపిక చేశారు. ఆయన పనితీరు సంతృప్తికరంగా ఉండటంతో హరీశ్ కుమార్ గుప్తానే ఇకపై పూర్తిస్థాయి డీజీపీగా నియమించాలని ఏపీ సర్కారు నిర్ణయించుకుంది. నియామక ఉత్తర్వులు జారీ చేసిన రోజు నుంచి.. రిటైర్‌మెంట్ వయసుతో సంబంధం లేకుండా రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.