Warren Buffett : ‘గేట్స్’కు బఫెట్ షాక్.. తాను మరణిస్తే డొనేషన్స్ ఆగిపోతాయని వెల్లడి
బిల్‌గేట్స్ ఫౌండేషన్.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌండేషన్లలో ఇది ఒకటి.
- Author : Pasha
Date : 30-06-2024 - 4:50 IST
Published By : Hashtagu Telugu Desk
Warren Buffett : బిల్‌గేట్స్ ఫౌండేషన్.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌండేషన్లలో ఇది ఒకటి. దీనికి భారీగా విరాళాలు ఇస్తున్న కుబేరుల జాబితాలో బెర్క్‌షైర్ హాత్‌వే అధినేత వారెన్ బఫెట్ కూడా ఉన్నారు. అయితే ఆయన తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం బిల్‌గేట్స్ ఫౌండేషన్‌కు షాక్ ఇచ్చేదే అని చెప్పొచ్చు.
We’re now on WhatsApp. Click to Join
ఒకవేళ తాను చనిపోతే.. ఆ తర్వాత తన కంపెనీల నుంచి బిల్‌గేట్స్ ఫౌండేషన్‌కు విరాళాలు అందవని వారెన్ బఫెట్ ప్రకటించారు. విరాళాలు ఎవరికి ఇవ్వాలి ? ఎంత ఇవ్వాలి ? అనే దానిపై తన ముగ్గురు కుమారులే విచక్షణతో నిర్ణయాలు తీసుకుంటారని వెల్లడించారు. ఈమేరకు ఆస్తి వీలునామాలో మార్పులు చేసినట్లు వారెన్ బఫెట్ తెలిపారు. భవిష్యత్తులో ఆస్తులను నిర్వహించే సామర్థ్యం తన పిల్లలకు ఉంటుందని నమ్ముతున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే తన కుమారులు కొన్ని దాతృత్వ సంస్థలను నిర్వహిస్తున్నారని.. తన మరణానంతరం ఆ వారసత్వాన్ని వారు కొనసాగిస్తారని బఫెట్(Warren Buffett) స్పష్టం చేశారు.
తన సంపదలో 99 శాతాన్ని కుటుంబానికి చెందిన నాలుగు దాతృత్వ సంస్థలతో పాటు బిల్ గేట్స్ ఫౌండేషన్‌కు కేటాయించినట్లు గతంలో బఫెట్‌ప్రకటించారు. ఆమేరకు అప్పట్లో వీలునామా రాశారు. తాజాగా గేట్స్ ఫౌండేషన్ నుంచి బిల్ గేట్స్ సతీమణి మెలిండా తప్పుకున్నారు. ఈతరుణంలో వారెన్ బఫెట్ తాను రాసిన ఆస్తి వీలునామాను సవరించి, ఈ కీలక నిర్ణయాన్ని తీసుకోవడం గమనార్హం. ప్రస్తుతానికి వారెన్ బఫెట్ నుంచి బిల్‌గేట్స్ సంస్థకు విరాళాలు కొనసాగుతాయని, బఫెట్ మరణం తర్వాత ఆ ప్రక్రియ ఆగిపోతుందని పరిశీలకులు అంటున్నారు. వారెన్ బఫెట్‌కు దాదాపు రూ.10 లక్షల కోట్ల సంపద ఉంది. స్టాక్ మార్కెట్‌లో చాకచక్యంగా పెట్టుబడులు పెట్టే విషయంలో యావత్ ప్రపంచంలో బఫెట్ చాలా ఫేమస్ అయ్యారు.