Electric Road : ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిక్ రోడ్డు.. ఎలా పనిచేస్తుంది ?
స్వీడన్ దేశంలో ఎలక్ట్రిక్ రోడ్డు(Electric Road) రెడీ అవుతోంది. ఈ రకం రోడ్డును నిర్మించడం ప్రపంచంలో ఇదే తొలిసారి.
- By Pasha Published Date - 02:54 PM, Sat - 26 April 25

Electric Road : ఇది ఎలక్ట్రిక్ యుగం. ఎలక్ట్రిక్ కార్లు, ద్విచక్ర వాహనాలు మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. అన్ని రంగాలకూ ఎలక్ట్రిక్ విప్లవం వేగంగా విస్తరిస్తోంది. అన్ని దేశాల ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ విప్లవానికి దన్నుగా నిలుస్తున్నాయి. ప్రజలు సైతం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఈనేపథ్యంలో మరో సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది. యావత్ ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచే, ఆలోచింపజేసే దిశగా ఒక దేశం సంచలన ముందడుగు వేసింది. ఏకంగా ఎలక్ట్రిక్ రోడ్డునే నిర్మించింది.
Also Read :KTR Vs Kavitha: కేటీఆర్, కవిత మధ్య కోల్డ్‌వార్.. ఈ ప్రచారంలో నిజమెంత?
ఈ ఏడాదే లాంఛింగ్..
స్వీడన్ దేశంలో ఎలక్ట్రిక్ రోడ్డు(Electric Road) రెడీ అవుతోంది. ఈ రకం రోడ్డును నిర్మించడం ప్రపంచంలో ఇదే తొలిసారి. ఈ రోడ్డును ఈ సంవత్సరమే ఓపెన్ చేయబోతున్నారు. తమ దేశంలోని దాదాపు 3000 కిలోమీటర్ల విస్తీర్ణంలో రోడ్లను ఎలక్ట్రిఫై చేయాలని స్వీడన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించే వారి కోసం బలమైన ఎకోసిస్టమ్‌ను తయారు చేస్తున్నారు.
ఎలక్ట్రిక్ రోడ్డు విశేషాలివీ..
- ఎలక్ట్రిక్ రోడ్డుపై ఎలక్ట్రిక్ వాహనం నడుస్తుండగానే ఛార్జింగ్ అయిపోతుంది. ఈ అంశం ఎలక్ట్రిక్ వాహనాల యజమానులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
- రోడ్డుపై వెళ్తుండగా ఎలక్ట్రిక్ వాహనానికి ఛార్జింగ్ చేయాలంటే.. ఆ వాహనానికి ఒక మూవబుల్ ఆర్మ్‌ను అమర్చాలి. దాని ద్వారానే ఆ వాహనం ఛార్జ్ అవుతుంది.
- ఎలక్ట్రిక్ వాహనానికి అమర్చే మూవబుల్ ఆర్మ్ రోడ్డులో అమర్చిన ఎలక్ట్రిక్ పవర్ ట్రాక్‌కు కనెక్ట్ అవుతుంది. దానిపై నుంచి వెళ్తుండగా వాహనం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది.
- ఈవిధమైన ఎలక్ట్రిక్ రోడ్డును 1 కిలోమీటరు పరిధిలో నిర్మించాలంటే దాదాపు రూ.10 కోట్లు ఖర్చవుతాయి.
- ఎలక్ట్రిక్ రోడ్డు గురించి పాదచారులు భయపడాల్సిన అవసరం లేదు. దానిపై నుంచి చెప్పులు లేకుండా సైతం నడవొచ్చు. ఎలాంటి షాకూ తగలదు.
- ఎలక్ట్రిక్ కార్లలో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లే వారికి ఈ తరహా రోడ్ల వల్ల చాలా ప్రయోజనం దక్కుతుంది.
- ప్రత్యేకించి మన భారతదేశంలోని జాతీయ రహదారులపై కొన్నిచోట్ల ఇలాంటి ఎలక్ట్రిక్ రోడ్లను నిర్మిస్తే.. ఎలక్ట్రిక్ వాహనదారులకు ఛార్జింగ్ బెడద తప్పుతుంది.