YS Vivekananda Reddy : ప్రత్యక్ష రాజకీయాల్లోకి వైఎస్ వివేకా ఫ్యామిలీ..!
- Author : Kavya Krishna
Date : 09-03-2024 - 5:03 IST
Published By : Hashtagu Telugu Desk
ఈ సారి ఏపీలో ఎన్నికలు కొత్త కొత్త మలుపులు తీసుకుంటున్నాయి. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ వ్యూహ రచనలు చేస్తున్నారు. అధికార వైసీపీని గద్దెదించాలని కంకణం కట్టుకున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు.. దాని కోసం జనసేన, బీజేపీలతో పొత్తుకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా.. టీడీపీకి కలిసివచ్చే ఏ చిన్న విషయాన్ని కూడా టీడీపీ వదుకోవడానికి సిద్ధంగా లేదు. అయితే.. ఈనేపథ్యంలోనే.. వారం రోజుల క్రితం వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి తన సోదరుడి పార్టీకి (వైఎస్‌ఆర్‌సిపి) ఓటు వేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా.. వివేకా హత్య కేసులో తన పోరాటానికి మద్దతు కోరారు. ఇప్పుడు, ఆమె వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చే చర్యలు కనిపిస్తు్న్నాయి. వైఎస్ వివేకా వర్ధంతి సందర్భంగా ఈ నెల 15వ తేదీన కడపలో సునీతారెడ్డి కుటుంబసభ్యులు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో సునీతారెడ్డి తన కుటుంబ సభ్యుల రాజకీయ ప్రవేశంపై వారి మద్దతుదారులతో చర్చించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కడప జిల్లాలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఈసారి ఎన్నికల అంశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి సానుకూలంగా మారిన ఈ అంశం ఇప్పుడు ప్రతికూలాంశంగా మారింది. వైఎస్ వివేకా కుటుంబం రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం జరుగుతోంది. వివేకా భార్య సౌభాగ్యమ్మ కడప ఎంపీ నుంచి పోటీ చేస్తారా లేదా పులివెందుల నుంచి పోటీ చేస్తారా అనే చర్చ సాగుతోంది. కడప ఎంపీ స్థానానికి సౌభాగ్యమ్మను అభ్యర్థిగా పరిగణించాలని జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతలు ప్రతిపాదించినట్లు సమాచారం. ఇదే జరిగితే వైఎస్ కుటుంబంలో అనూహ్య పరిణామం తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కడప ఎంపీగానీ, పులివెందుల అసెంబ్లీ స్థానానికి గానీ సౌభాగ్యమ్మను పోటీకి దింపాలనే ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పులివెందుల, కడప జిల్లాల ప్రజలకు తమ కుటుంబం రాజకీయాల్లోకి రావడానికి దారితీసిన పరిస్థితులను తెలియజేసేందుకు ఆత్మీయ సమావేశం ఒక అవకాశంగా భావిస్తున్నారు.
Read Also : Aara Mastan Survey : టీడీపీ+బిజెపి.. లాభమా?.. నష్టమా..? ఆరా మస్తాన్ సర్వే ఏం చెబుతోంది..?