YSRCP Plenary 2022 : జగన్ చిన్ననాటి జ్ఞాపకాల్లో విజయమ్మ
గుంటూరు ప్లీనరీ వేదికగా జగన్మోహన్ రెడ్డి బాల్యానికి సంబంధించిన జ్ఞాపకాలను విజయమ్మ నెమరువేసుకున్నారు.
- Author : CS Rao
Date : 08-07-2022 - 3:16 IST
Published By : Hashtagu Telugu Desk
గుంటూరు ప్లీనరీ వేదికగా జగన్మోహన్ రెడ్డి బాల్యానికి సంబంధించిన జ్ఞాపకాలను విజయమ్మ నెమరువేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ తన ప్రసంగంలో ఆసక్తికర అంశాన్ని గుర్తు చేశారు. తన బిడ్డ జగన్ రాజకీయాల్లోకి రావాలన్నది అనూహ్య నిర్ణయం కాదని చెప్పారు. తండ్రి బాటలో పయనించాలని విద్యార్థి దశలోనే నిర్ణయించుకున్నాడని చెప్పారు. “అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ ఇంట్లో ఉండేవారు కాదు. రాజకీయాలతో జిల్లాల్లో తిరుగుతుండేవారు. అప్పుడు జగన్ చిన్నవాడు. పదో తరగతి చదువుతున్నాడు. రాజశేఖర్ రెడ్డి వారానికి ఒకసారైనా ఇంటికి వచ్చి మాతో గడిపిన సందర్భాలు చాలా తక్కువ. అందుకే, నేను జగన్ తో ఇలా అన్నాను.. నాన్నా, నువ్వు తండ్రిలా రాజకీయాల్లోకి వెళ్లొద్దు, నాలుగు ఇండస్ట్రీలు పెట్టుకుని, కాలు మీద కాలేసుకుని దర్జాగా బతకాలి. పదిమందికి ఉపయోగపడినట్టు ఉంటుంది అని చెప్పాను. రాజకీయ జీవితం వద్దు, వ్యాపార జీవితం ఎంచుకో అని అన్నాను. అప్పుడు జగన్ కు పద్నాలుగు, పదిహేనేళ్ల వయసుంటుందేమో…. ఇలా అన్నాడు నాతో… అమ్మా, ఇలాంటి లైఫ్ కాదమ్మా నేను కోరుకునేది. నాన్న ఏ బాటలో నడుస్తున్నాడో, నేను కూడా అదే బాటలో నడుస్తాను అన్నాడు. కష్టాలకు వెనుదీయను అన్నాడు. ఆ సమయంలో తల్లిగా బాధపడ్డాను. బిడ్డ సుఖంగా ఉండాలనే కోరుకున్నాను. కానీ ఇవాళ జగన్ సంపాదించిన అభిమానం చూసి తల్లిగా గర్విస్తున్నా. తన మనసుతో చేసే ఈ పరిపాలనను కళ్లారా చూస్తున్నా. ఇంతకంటే ఇంకే కావాలి” అంటూ విజయమ్మ భావోద్వేగాలకు లోనయ్యారు.