YS Jagan: నా తల్లి, చెల్లి ఫోటోలతో రాజకీయాలా?
- By Kode Mohan Sai Published Date - 02:52 PM, Thu - 24 October 24

YS Jagan: వైఎస్సార్ కుటుంబంలో ఆస్తి తగాదాల అంశం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరియు చెల్లెలు వైఎస్ షర్మిల మధ్య లేఖల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. షర్మిలకు రాసిన లేఖలో, “నేను నీకు రాసిచ్చిన ఆస్తులను వెనక్కి తీసుకుంటున్న” అని జగన్ పేర్కొన్నారని, దీనికి షర్మిల ఘాటుగా సమాధానం ఇచ్చినట్లు సోషల్ మీడియాలో కొన్ని లేఖలు వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలో, ఆస్తుల వివాదంపై వైఎస్ జగన్ స్పందించారు. విజయనగరం జిల్లా గుర్లలో ఆయన పర్యటించిన సందర్భంగా, ఆస్తులకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు ఈ అంశంపై మరింత చర్చకు ప్రేరేపించాయి. జగన్ చెప్పిన విషయాలు, ఈ వివాదం ఎలా రూపు దిద్దుకున్నాయి అన్నది ప్రజల్లో ఆసక్తిని కలిగించాయి.
విజయనగరం జిల్లా పర్యటనకు వస్తున్నానని తెలిసి, టీడీపీ టాపిక్ డైవర్ట్ చేసిందని ఆరోపించారు జగన్. తన చెల్లి మరియు తల్లి ఫోటోలతో రాజకీయం చేస్తున్నారని, వారి ఇళ్లలో ఇలాంటి సమస్యలు లేవా అని ప్రశ్నించారు. ఈ విషయాలు ప్రతి ఇంట్లో ఉండే సాధారణ అంశాలు, కానీ స్వార్థం కోసం వాటిని పెద్దదిగా చూపించడం, వక్రీకరించి వివరించడం తగదని ఆయన అన్నారు.
ఇలాంటి అంశాలను వదిలేసి, ప్రజల సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టాలనే హితవు పలికారు. టీడీపీ, కూటమి అక్రమాలు మరియు అన్యాయాలను బయటపెడుతున్నందున డైవర్షన్ పాలిటిక్స్‌ను ప్రారంభించారంటూ ఆయన వ్యాఖ్యానించారు.
గుర్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పారు జగన్. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామస్వరాజ్యం తీసుకొచ్చామని, ఆ సమయంలో గ్రామ సచివాలయాల్లో వివిధ శాఖల ఉద్యోగులు కనిపించేవారన్నారు. గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు ఉండేవని, వాటితో అనుసంధానంగా ఏఎన్‌ఎంలు పనిచేస్తుండేవారని చెప్పారు. ప్రతి గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఉండేది, కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తే అవి మారిపోయాయని వ్యాఖ్యానించారు.
గుర్లలో డయేరియాతో 14 మంది చనిపోయారని, తాను ట్వీట్ చేస్తే తప్ప పట్టించుకునే వారు లేరన్నారు. సెప్టెంబర్ 20న తొలి డయేరియా మృతి కేసు నమోదైనప్పటి నుంచి 35 రోజులైనా ప్రభుత్వం స్పందించలేదన్నారు. ప్రభుత్వ దృష్టి లేకపోవడం వల్లనే ఈ పరిస్థితులు ఏర్పడినట్లు ఆయన అన్నారు.
చంపా నదిలో నీళ్లు దారుణంగా ఉన్నాయని చెప్పారు జగన్. చంపా నదిపై వాటర్ స్కీమ్ మెయింటెనెన్స్‌ను రెన్యూవల్ చేయలేదని, ఈ 5 నెలల్లో కనీసం క్లోరినేషన్ కూడా జరగలేదన్నారు. గుర్ల మండల ప్రభుత్వాస్పత్రిలో 340 మంది చికిత్స పొందుతున్నారని, మరో 100 మందికి పైగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.
మెరుగైన చికిత్స కోసం బాధితులను విశాఖ లేదా విజయనగరం ఆస్పత్రులకు ఎందుకు తరలించలేదని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలను డయేరియాతో చనిపోయారని చెప్పొద్దని ఉచిత సలహాలు ఇస్తున్నారని, సీహెచ్‌సీల్లో స్పెషలిస్టు డాక్టర్లను తొలగించినట్లు తెలిపారు.
డయేరియా మృతుల కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు జగన్. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున సాయం అందిస్తామని వెల్లడించారు. డైవర్షన్ పాలిటిక్స్‌ను ఆపి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు.
మదనపల్లిలో ఫైళ్లు తగలబడినప్పుడు హెలికాఫ్టర్‌లో డీజీపీని పంపారని, కానీ ఇక్కడ ప్రాణాలు పోతున్నా ఒక్క మంత్రి కూడా రాలేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రతి సమయంలో చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు.