అంబటి, జోగి కుటుంబాలను పరామర్శించనున్న జగన్ ! గుంటూరు లో ఏంజరుగుతుందో ?
రేపు ఆయన గుంటూరులో పర్యటించి, ఇటీవల అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అంబటి రాంబాబు అరెస్ట్ కావడం వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది
- Author : Sudheer
Date : 03-02-2026 - 9:20 IST
Published By : Hashtagu Telugu Desk
YS Jagan to Visit Jogi Ramesh And Ambati Rambabu Family : వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ కీలక నేతలకు అండగా నిలిచేందుకు రంగంలోకి దిగుతున్నారు. రేపు ఆయన గుంటూరులో పర్యటించి, ఇటీవల అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అంబటి రాంబాబు అరెస్ట్ కావడం వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన పార్టీ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపడమే కాకుండా, ప్రభుత్వ వైఖరిని నిలదీసే వేదికగా మారనుంది.
గుంటూరు పర్యటన అనంతరం జగన్ ఇబ్రహీంపట్నానికి వెళ్లనున్నారు. అక్కడ మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి చేరుకుని ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను కలుస్తారు. జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయని, ఆ దాడిలో ఇల్లు ధ్వంసమైందని వైసీపీ ఆరోపిస్తోంది. స్వయంగా దెబ్బతిన్న ఇంటిని పరిశీలించడం ద్వారా, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలకు వివరించే ప్రయత్నం జగన్ చేయనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ఇప్పటికే పర్యవేక్షిస్తున్నారు.
ఈ పర్యటనలు కేవలం పరామర్శలకే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది. అధికార పక్షం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ ఆరోపిస్తుంటే, చట్టం తన పని తాను చేసుకుపోతుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. జగన్ పర్యటనల ద్వారా క్యాడర్‌ను ఏకతాటిపైకి తెచ్చి, ప్రభుత్వ వ్యతిరేక గళాన్ని బలోపేతం చేయాలని వైసీపీ భావిస్తోంది. రెండు ప్రధాన పార్టీల మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితులు ఏపీ రాజకీయ చిత్రపటాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి.