YS Jagan: `జగనన్నకు చెబుదాం` లేనట్టే!
పశ్చిమ బెంగాల్ సీఎం మమత నిర్వహిస్తోన్న ‘దీదీ కో బోలో’ తరహాలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి `జగనన్నకు చెబుదాం` అనే కార్యక్రమాన్ని రూపొందించారు.
- By CS Rao Published Date - 03:02 PM, Mon - 31 October 22

పశ్చిమ బెంగాల్ సీఎం మమత నిర్వహిస్తోన్న ‘దీదీ కో బోలో’ తరహాలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి `జగనన్నకు చెబుదాం` అనే కార్యక్రమాన్ని రూపొందించారు. నవంబర్ రెండో తేదీ నుంచి ఆ ప్రోగ్రామ్ ను ప్రారంభించాలని సీఎంవో ప్లాన్ చేసినప్పటికీ కొన్ని సాంకేతిక, మౌలిక కారణాల దృష్ట్యా వాయిదా పడింది. మూడేళ్ల పరిపాలనపై ప్రజల్లోని వ్యతిరేకతను ఫోన్ల ద్వారా చవిచూడాల్సి వస్తుందని వాయిదా వేసుకున్నారని ప్రత్యర్థులు విమర్శలను ఎక్కుపెడుతున్నారు.
వాస్తవంగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎక్కడ నుంచి `రచ్చబండ` కార్యక్రమాన్ని ఆపారో అక్కడ నుంచి మొదలు పెట్టాలని తొలుత జగన్ మోహన్ రెడ్డి యోచించారు. తొలి ఏడాది పాలన తరువాత `మంచి సీఎం` గా ప్రజల వద్దకు వెళ్లాలని భావించారు. కానీ, కరోనా రూపంలో రెండేళ్ల పాటు ఆయన్ను బయటకు రాకుండా చేసింది. ఆ తరువాత ప్రజాదర్బార్ ను నిర్వహించాలని అనుకున్నారు. ఉమ్మడి ఏపీలో స్వర్గీయ వైఎస్ మాదిరిగా సీఎంవో ఆఫీస్ కేంద్రంగా ప్రజా దర్బార్ పెట్టాలని భావించారు. కానీ, పరిస్థితులు అనుకూలించకపోవడంతో చంద్రబాబు హయాంలో నిర్వహించిన `సీఎం కనెక్ట్` ప్రోగ్రామ్ ను నిర్వహించాలని అనుకన్నారట. ఆ ప్రోగ్రామ్ కు ` సీఎం కనెక్ట్`కు బదులుగా `జగనన్నకు చెబుదాం` అంటూ పేరు మార్చారు.
Also Read: AP Politics: జగన్ మీద పవన్ `ఆడిట్` అస్త్రం
నవంబర్ 2 నుంచి ఫోన్ల ద్వారా ప్రజలతో మమేకం కావడానికి సీఎంవో ఆఫీస్ సిద్ధం అయింది. గత సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం `CM కనెక్ట్ ` ప్రోగ్రామ్ కొత్త వెర్షన్ `జగనన్నకు చెబుదాం`. అప్పట్లో ప్రత్యేక ఫోన్ లైన్ 1100కు బదులుగా మరో నెంబర్ ను పరియడం చేయడం మినహా అంతా అదే ఫార్మాట్ అంటూ CMO వర్గాలు వెల్లడించాయి. కానీ, మౌలిక వనరులు లేకపోవడంతో ఆ ప్రోగ్రామ్ ను వాయిదా వేసుకున్నట్టు ప్రకటించడం గమనార్హం.
ప్రస్తుతం జనసేనాని నిర్వహిస్తోన్న ‘జన వాణి’కి కౌంటర్‌గా `జగనన్నకు చెబుదాం` ఉందని కొందరు అన్నారట. అందుకే, వాయిదా పడిందని తాడేపల్లి వర్గాల్లోని టాక్. 2019 మేలో ముఖ్యమంత్రి అయిన తర్వాత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదులను నమోదు చేసుకునేందుకు ‘స్పందనస కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫిర్యాదుల పరిష్కారానికి నిర్దిష్ట సమయపాలన నిర్ణయించబడింది. ప్రజలు లేవనెత్తిన 90 శాతం సమస్యలు పరిష్కరించబడినట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రత్యామ్నాయంగా, ప్రజలు తమ ఫిర్యాదులను స్పందన పోర్టల్‌లో ఇమెయిల్ ద్వారా కూడా నివేదించవచ్చు. అంతేకాకుండా, అదే ప్రయోజనం కోసం హెల్ప్‌లైన్ నంబర్ 1902 కూడా ఉంది.
Also Read: Munugode Bypoll: రాజగోపాల్ కు ఎలక్షన్ కమిషన్ నోటీస్ !
`రచ్చబండ` టైటిల్ తో ప్రస్తుతం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు ప్రతిరోజూ సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. బహుశా అందుకే, `రచ్చబండ` టైటిల్ తో ప్రజల మధ్యకు వెళ్లడానికి జగన్మోహన్ రెడ్డి నిరాకరిస్తున్నారని తెలుస్తోంది. వాస్తవంగా వైఎస్ ఆర్ మరణం తరువాత ఆ ప్రోగ్రామ్ ను నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి తలపోశారు. ఇక `జనవాణి` కి కౌంటర్ గా జగన్మోహన్ రెడ్డి మరో ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నారని మంగళగిరి ఆఫీస్ లో పవన్ అన్నారు. బహుశా అందుకే, `జగనన్నకు చెబుదాం` కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని ఉంటారని జగన్మోహన్ రెడ్డి అనుచరుల్లోని టాక్. సీఎం జగన్ కు బదులుగా సిఎంఓలోని సీనియర్ ఐఎఎస్ అధికారి ‘జగనన్నకు చెబుతాం’ బాధ్యతలు నిర్వహిస్తారని, ఫిర్యాదులపై తదుపరి చర్యలు తీసుకుంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ శాసనసభ్యులు, నాయకులు చేస్తున్న ఇంటింటి ప్రచారానికి వస్తున్న వ్యతిరేకతకు విరుగుడుగా `జగనన్నకు చెబుదాం` నడపాలని అనుకున్నారు. కానీ, ప్రజల నుంచి ఫోన్ల ద్వారా వచ్చే వ్యతిరేకతను తట్టుకోగలరా? అనే కోణం నుంచి ఆలోచించిన సీఎంవో ఆఫీస్ ఆ ప్రోగ్రామ్ స్క్రీన్ ప్లే ను మార్చేసి సీనియర్ ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద త్రిబుల్ ఆర్ `రచ్చబండ` చంద్రబాబు `సీఎం కనెక్ట్`, జనసేనాని `జనవాణి`లను కాపీ కట్టడం ఇష్టంలేకి జగన్మోహన్ రెడ్డి ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు దూరం జరిగారని తెలుస్తోంది.
Also Read: Capital Vizag: దొరకని దొరలు! అమరావతిని తలదన్నే విశాఖ భూ దందా!