Rayalaseema Roars in Tirupati: విశాఖ గర్జనకు మిన్నగా సీమగర్జన
విశాఖ గర్జన విజయవంతం అయిందని భావిస్తోన్న వైసీపీ రాయలసీమ గర్జనకు దిగింది. తిరుపతి కేంద్రంగా భారీ గర్జన ఏర్పాట్లు చేసింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్మాత్మిక నగరం తిరుపతి ఆత్మగౌరవ నినాదానికి వేదిక అయింది. వికేంద్రీకరణ ఉద్యమానికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నేతృత్వం వహించనున్నారు.
- Author : CS Rao
Date : 29-10-2022 - 2:24 IST
Published By : Hashtagu Telugu Desk
విశాఖ గర్జన విజయవంతం అయిందని భావిస్తోన్న వైసీపీ రాయలసీమ గర్జనకు దిగింది. తిరుపతి కేంద్రంగా భారీ గర్జన ఏర్పాట్లు చేసింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్మాత్మిక నగరం తిరుపతి ఆత్మగౌరవ నినాదానికి వేదిక అయింది. వికేంద్రీకరణ ఉద్యమానికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నేతృత్వం వహించనున్నారు. ఈ నెల 29న తిరుపతిలో భారీ ర్యాలీ, బహిరంగ సభ జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి ప్రాంతీయ ఆత్మాభిమానం సెంటిమెంట్ ను బలంగా తీసుకెళ్లాలని వైసీపీ తలపోస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఉత్తరాంధ్రలోకి మహా పాదయాత్ర ఎంట్రీ ఇవ్వగానే విశాఖ గర్జన నిర్వహించడం వ్యూహాత్మకం. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ప్రజానీకం మహాపాదయాత్రకు వ్యతిరేకం అనే నినాదాన్ని పంపించేలా ప్లాన్ చేసింది వైసీపీ.
శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలు రాజధాని కావాలనే బలమైన డిమాండ్‌ను మరోసారి వైసీపీ లేవనెత్తుతోంది. సీమ సమాజ ఆకాంక్షను, ఆశయాల్ని చెప్పేందుకు తిరుపతిలో భారీ ర్యాలీ, సభ నిర్వహణ భారీగా జరుగుతోంది. రాయలసీమకు రాజధాని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాయలసీమ సమాజం దృష్టిలో రాజధాని అంటే ఆత్మాభిమానం, ఆత్మగౌరవానికి సంబంధించిన వ్యవహారమని చెబుతున్నారు. సీమ ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని న్యాయ రాజధాని కావాలని డిమాండ్ చేస్తున్నారు. కోస్తా రాజధాని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అడ్డగా మారిందని విమర్శిస్తున్నారు.
Also Read: New Perspective on Amaravati: అమరావతి పై వైసీపీ `శంకుస్థాపన` లాజిక్
సీమలోని ప్రజాసంఘాలు, ఉద్యమకారులు, బుద్ధి జీవులను కలుపుకుని ఈ నెల 29న తిరుపతి కృష్ణాపురం ఠాణా నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకూ భారీ ర్యాలీ పెట్టారు. రాయలసీమ ఉద్యమానికి దివిటీలా తిరుపతి గర్జన ఉంటుందని వైసీపీ రాయలసీమ నేతలు అంటున్నారు. విశాఖ గర్జనను మించి, సీమ గర్జన ఉండేలా చేసి ఆత్మగౌరవ నినాదాన్ని చాటాలని పిలుపునివ్వడం గమనార్హం.