Gannavaram : గన్నవరంలో వేడెక్కుతున్న రాజకీయం.. రేపు కార్యకర్తలతో యార్లగడ్డ ఆత్మీయ సమావేశం
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యే
- Author : Prasad
Date : 12-08-2023 - 7:22 IST
Published By : Hashtagu Telugu Desk
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఖరారైంది. ఈ నేపథ్యంలో వైసీపీలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు తన భవిష్యత్ కార్యచరణపై కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని భావించారు. రేపు(ఆదివారం) నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశానికి భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి యార్లగడ్డ వెంకట్రావుతో పాటు దుట్టా రామచంద్రరావు కూడా హాజరుకానున్నారు.
ఈ సమావేశంలో కార్యకర్తల అభిప్రాయాలను తీసుకుని తన భవిష్యత్ కార్యచరణను యార్లగడ్డ వెంకట్రావు ప్రకటించనున్నారు. ఇప్పటికే యార్లగడ్డ వెంకట్రావుకు టీడీపీ నుంచి పిలుపు వచ్చింది. వల్లభనేని వంశీ పార్టీ మారిన మరుసటి రోజే టీడీపీ యార్లగడ్డకు గాలం వేసింది. అయితే అప్పటికే కేడీసీసీ ఛైర్మన్‌గా ఉన్న యార్లగడ్డ పార్టీ మార్పుపై పెద్దగా ఆలోచన చేయలేదు. కానీ గత ఏడాది కాలంగా నియోజకవర్గంలో తన వర్గాన్ని ఇబ్బందులకు గురి చేస్తన్నారంటూ యార్లగడ్డ అధిష్టానానికి ఫిర్యాదు చేశాడు. అయినప్పటికి ఎలాంటి పురోగతి లేకపోవడంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దమైనట్లు సమాచారం. ఈ నెల 19వ తేదీన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర కృష్ణాజిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ యాత్రలో యార్లగడ్డ వెంకట్రావు పాల్గొనే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. గన్నవరం టీడీపీకి బలమైన అభ్యర్థి లేకపోవడంతో యార్లగడ్డను పార్టీలోకి తీసుకుని వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు యార్లగడ్డ వెంకట్రావు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారని ఆయన అనుచరులు చెప్తున్నారు.