April 27: ఆ రెండు అధికార పార్టీలకు ‘ఏప్రిల్ 27’ టెన్షన్!
తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రెండు పార్టీలకు కంటి మీద కునుకు లేదు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని సమర్థంగా ఢీకొడుతోంది తెలుగుదేశం పార్టీ.
- By Hashtag U Published Date - 09:56 AM, Tue - 26 April 22

తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రెండు పార్టీలకు కంటి మీద కునుకు లేదు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని సమర్థంగా ఢీకొడుతోంది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు యాక్టివ్ గా ఉంటూ పార్టీని యాక్టివ్ చేస్తున్నారు. తెలంగాణలో ఇన్నాళ్లూ టీఆర్ఎస్ పాడిందే పాట అయినా..ఇప్పుడు బీజేపీ రూపంలో ప్రత్యర్థిని ఎదుర్కొంటోంది. హస్తంతో పోలిస్తే.. కమలంతోనే దానికి రాజకీయ ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో అటు వైసీపీ, ఇటు టీఆర్ఎస్ లు తమతమ పార్టీల ముఖ్యులతో సమావేశాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఆ తేదీ.. ఏప్రిల్ 27.
ఇటు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి సొంత పార్టీ శ్రేణుల నుంచి తలనొప్పి తప్పడం లేదు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తరువాత అసమ్మతి రాగం వినిపిస్తోంది. స్వయంగా జగనే కలగజేసుకుని మరీ వారిని సముదాయించాల్సి వస్తోంది. ఆయన ముందు యస్ బాస్ అని అనేసినా.. అసంతృప్తులు మాత్రం ఇంకా రాజీపడలేకపోతున్నారని తెలుస్తోంది. అందుకే మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో ఓ మీటింగ్ ను ఏర్పాటు చేశారు జగన్. ఆ తేదీ ఏప్రిల్ 27.
2014, 2018 ఎన్నికల్లో సొంత చాతుర్యంతో, చాణక్య తెలివితేటలతో టీఆర్ఎస్ ని గెలిపించారు కేసీఆర్. కానీ 2023 లో కారును గెలుపు తీరాలకు చేర్చాలంటే చెమటోడ్చక తప్పని పరిస్థితి. ఎందుకంటే దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలు ఆయనను కలవరపెడుతున్నాయి. పైగా పీకేతో కలిసి పనిచేయకపోతే.. కొత్త ఓటర్లను పార్టీ వైపు ఆకర్షించడం కూడా కష్టమవుతోంది. దీనికి సోషల్ మీడియా పరంగా సపోర్ట్ కావాలి. ఓ వ్యూహకర్త అవసరం అవుతుంది. అందుకే పీకేతో జట్టు కట్టారు. ఆయన కొన్ని రిపోర్ట్స్ ఇచ్చారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నుంచే ఆ స్కెచ్ ల ఆధారంగా గులాబీ బాస్ యాక్షన్ ప్లాన్ ని అమలు చేయబోతున్నారు. ఆ తేదీ ఏప్రిల్ 27.
వైసీపీ, టీఆర్ఎస్ అధిష్టానాలు.. తమ పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా బాగా టెన్షన్ పడుతున్నాయి. మరి వాటి టెన్షన్ ను ఏప్రిల్ 27 నాటి సమావేశాలు తీర్చుతాయా లేదా అన్నది చూడాలి.