చింతకాయల విజయ్‌కు కీలక పదవి దక్కబోతుందా ?
సుదీర్ఘ కాలంగా పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేయడమే కాకుండా, సోషల్ మీడియా మరియు ఐటీ విభాగాల్లో పార్టీ గొంతుకను బలంగా వినిపించడంలో విజయ్ కీలక పాత్ర పోషించారు. ఆయన పడ్డ కష్టానికి తగిన గుర్తింపుగా ఈ ఎంపీ సీటును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
- Author : Sudheer
Date : 11-02-2026 - 3:47 IST
Published By : Hashtagu Telugu Desk
Chintakayala Vijay : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల కోలాహలం ఇప్పుడే మొదలైంది. వచ్చే ఏడాది ఖాళీ కాబోతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, పార్టీ ఐటీ వింగ్ బాధ్యుడు చింతకాయల విజయ్‌కు దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సుదీర్ఘ కాలంగా పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేయడమే కాకుండా, సోషల్ మీడియా మరియు ఐటీ విభాగాల్లో పార్టీ గొంతుకను బలంగా వినిపించడంలో విజయ్ కీలక పాత్ర పోషించారు. ఆయన పడ్డ కష్టానికి తగిన గుర్తింపుగా ఈ ఎంపీ సీటును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
చింతకాయల విజయ్ ఎంపిక వెనుక బలమైన సమీకరణాలు కనిపిస్తున్నాయి. ఆయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడు కావడం ఒక ఎత్తయితే, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వద్ద కూడా మంచి నమ్మకాన్ని సంపాదించుకోవడం మరో ఎత్తు. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం విజయ్‌కు పెద్ద ప్లస్ పాయింట్. “టీడీపీ అంటేనే బీసీల పార్టీ” అనే నినాదాన్ని మరింత బలోపేతం చేసేందుకు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన యువ బీసీ నాయకత్వాన్ని జాతీయ స్థాయికి పంపడం ద్వారా పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం నింపవచ్చని అధిష్టానం భావిస్తోంది.
రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. చంద్రబాబు, లోకేష్ ఇప్పటికే విజయ్ అభ్యర్థిత్వంపై సానుకూల సంకేతాలు (Green Signals) ఇచ్చినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కొని, ఐటీ వింగ్ ద్వారా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో ఆయన చూపిన చొరవను అధిష్టానం గుర్తించింది. ఒకవేళ రాజ్యసభ సీటు ఖరారైతే, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తర్వాత పార్టీ కోసం శ్రమించిన యువ రక్తానికి ప్రాధాన్యత ఇచ్చారనే సందేశం ప్రజల్లోకి వెళ్తుంది. విజయ్ కు ఈ పదవి దక్కితే అది ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.