Ambedkar Vidya Nidhi Scheme : అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని మళ్లీ తీసుకొస్తాం – చంద్రబాబు
Ambedkar Vidya Nidhi Scheme : చంద్రబాబు తన ప్రసంగంలో పేదలకు అండగా ఉండటమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టంగా పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెసిడెన్షియల్ స్కూళ్లలో నాణ్యమైన విద్య, సకాలంలో సమృద్ధిగా భోజనం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు
- Author : Sudheer
Date : 14-04-2025 - 3:54 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) గుంటూరు జిల్లా పొన్నెకల్లులో నిర్వహించిన సభలో కీలక ప్రకటన చేశారు. ఒకప్పుడు అమలు చేసిన అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని (Ambedkar Vidya Nidhi Scheme) తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్థిక సాయం అందించనున్నామని వెల్లడించారు. ఈ పథకం మళ్లీ ప్రారంభమవడం వల్ల వేలాది మంది విద్యార్థులకు భవిష్యత్తులో మెరుగైన అవకాశాలు లభించనున్నాయని ఆయన పేర్కొన్నారు.
Blatant Mistake: షాకింగ్ పోలీసింగ్.. నిందితుడి బదులు జడ్జిని వెతికిన ఎస్సై
చంద్రబాబు తన ప్రసంగంలో పేదలకు అండగా ఉండటమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టంగా పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెసిడెన్షియల్ స్కూళ్లలో నాణ్యమైన విద్య, సకాలంలో సమృద్ధిగా భోజనం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రత్యేకంగా అమరావతిలో ప్రతిష్టాత్మక యూనివర్శిటీలు, ఉన్నత స్థాయి కళాశాలలను నెలకొల్పి, విద్యార్ధులకు ఉత్తమ విద్యా వాతావరణాన్ని కల్పిస్తామని తెలిపారు.
చివరగా చంద్రబాబు గత ప్రభుత్వ కాలంలో ఎదురైన రాజకీయ దుర్వినియోగాన్ని గుర్తు చేశారు. 2019 నుండి 2024 వరకు చరిత్రలో ఎప్పుడూ చూడనంత చీకటి రాజకీయాలను చూశానని, ఆ సమయంలో తనలాంటి నాయకులు కూడా బయటకు రావడానికి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రజల ఆశీస్సులతో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మళ్లీ అధికారంలోకి వచ్చామన్నారు. విద్యను ప్రధానంగా అభివృద్ధి చేసి, సామాజిక సమానత్వాన్ని సాధించడమే తమ పాలనలో ప్రాధాన్యతగా తీసుకుంటామని స్పష్టం చేశారు.