Vijaya Sai Reddy : విజయసాయి ఊహించని పని చేసి వార్తల్లో నిలిచాడు
Vijaya Sai Reddy : వైసీపీలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌తో కలిసి కేసుల కోణంలో జైలుకి వెళ్లిన అనుభవం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శకుడిగా ఉండడం గుర్తించదగిన విషయం
- By Sudheer Published Date - 07:34 PM, Mon - 21 July 25

నిత్యం రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తూ ఉండే విజయసాయిరెడ్డి (Vijaya Sai Reddy), ఈ మధ్యకాలంలో పూర్తిగా మౌనం వహిస్తూ వస్తున్నారు. వైసీపీని విడిచిన తర్వాత బీజేపీలో చేరతారన్న వార్తల మధ్య, ఆయన నుంచి రాజకీయ వ్యాఖ్యలు మాత్రం కనుమరుగయ్యాయి. కానీ తాజాగా ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అది కూడా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పుట్టిన రోజు (Mallikarjuna Kharge’s Birthday) సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్ కావడం విశేషం. ఆయన ఖర్గేను “దేశంలో అత్యంత అనుభవజ్ఞుడు”గా పేర్కొనడం, ఆరోగ్యం కోరడం, ప్రజాస్వామ్యంపై వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ఒక ట్విస్ట్‌లా మారింది.
Vijay Devarakonda New Look : క్లీన్ షేవ్ తో విజయ్ దేవరకొండ మాస్ లుక్
ఇప్పటి వరకు కాంగ్రెస్‌పై విమర్శలే చేసిన విజయసాయి, ఈసారి ఓ సానుకూల ధోరణిలో స్పందించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా “నిర్మాణాత్మక చర్చలు జరగాలి, ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య విధానంలో జవాబుదారిగా చేయాలి” అనే ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు సూచనలాగే వినిపించాయి. ఒకవైపు రాజకీయాలకు విరామం తీసుకున్నట్టు కనిపిస్తున్నా, మరోవైపు కీలకమైన సందర్భాల్లో స్పందించడం ఆయన రాజకీయ వ్యూహశక్తిని గుర్తుచేస్తోంది. ఇదంతా చూస్తుంటే ఆయన తీరులో మార్పు కనిపిస్తోంది.
వైసీపీలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌తో కలిసి కేసుల కోణంలో జైలుకి వెళ్లిన అనుభవం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శకుడిగా ఉండడం గుర్తించదగిన విషయం. ఆ తర్వాత బీజేపీ పెద్దలతో సన్నిహితంగా ఉండటం, పార్లమెంట్‌లో బీజేపీ తరపున గళం వినిపించడం తెలిసిందే. అలాంటి వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడికి శుభాకాంక్షలు చెబుతుండటం రాజకీయ మార్పులకు సంకేతమా? బీజేపీలో ఆయనకు స్థానం సరిగా దక్కకపోవడం, రాబోయే రాజకీయాల్లో కొత్త అవకాశాల కోసం చూస్తుండడం వంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవడం ప్రారంభించిన ఈ సమయంలో విజయసాయిరెడ్డి ఇలా స్పందించడంలో ఆలోచిత వ్యూహం దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.