New Districts in AP : ఎన్నికల అస్త్రంగా జిల్లాల పునర్విభజన ప్రక్రియ
ఏపీ ప్రభుత్వం చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ రాజకీయ ఎజెండా మారుతోంది.
- By CS Rao Published Date - 03:56 PM, Tue - 5 April 22

ఏపీ ప్రభుత్వం చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ రాజకీయ ఎజెండా మారుతోంది. అధికారంలోకి వస్తే, ఇప్పుడున్న జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను మార్పు చేస్తామని టీడీపీ, జనసేన చెబుతోంది. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా జిల్లాలు ఏర్పడ్డాయని ఆ రెండు పార్టీల చీఫ్ లు చంద్రబాబు, పవన్ విశ్వసిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలకు గెజిట్ ఇవ్వడంతో పాటు పరిపాలన కూడా ప్రారంభం అయింది. ఆ క్రమంలో ఏమీ చేయలేని పరిస్థితుల్లో అధికారంలోకి వస్తే ప్రజాభీష్టం మేరకు మార్పులు చేస్తామని టీడీపీ, జనసేన హామీ ఇవ్వడం గమనార్హం.మరో జిల్లాలను గిరిజనుల కోసం ఏర్పాటు చేయడానికి జగన్ సర్కార్ సిద్ధం అవుతోంది. ఆ విషయాన్ని మంత్రి పేర్ని నానా వెల్లడించారు. గిరిజన ప్రాంతాలకు ప్రస్తుతం రెండు జిల్లాలు ఉన్నాయని, మరో జిల్లాను పోలవరం ముంపు ప్రాంతాలు, రంపచోడవరంను కలుపుతూ రూపకల్పన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే, 27 జిల్లాలతో ఏపీ కొత్త పాలన ఉంటుంది. జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు విషయంలో చాలా చోట్ల అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉన్నాయి. అయినప్పటికీ వాటిని బుట్టదాఖలు చేసి రాజకీయంగా,సామాజికవర్గానికి అనుకూలంగా జగన్ నిర్ణయం తీసుకున్నాడని ప్రత్యర్థి పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.కొన్ని గిరిజన ప్రాంతాల్లో ప్రజలు జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి 300 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏప్రిల్ 4 సోమవారం నాడు 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం ప్రతిపక్షాలను ఉలిక్కిపడేలా చేసింది. పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ అశాస్త్రీయంగా ఉందనే ఆరోపణలు కోకొల్లలు. ప్రజల మేలు కోసమే జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిందని చెప్పడాన్ని టీడీపీ, జేఎస్పీ అంగీకరించలేదు .
కొత్త జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయమని, రాజకీయ ప్రేరేపితమని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రస్తుత పాలనలో జరుగుతున్న ఇలాంటి తప్పిదాలన్నింటినీ సరిదిద్దాడానికి టీడీపీ అధికారంలోకి రావాలని అన్నారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లపై ప్రజలు చేస్తున్న అభ్యంతరాలు, నిరసనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని నాయుడు ఆరోపించారు.ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అభ్యర్థనను గౌరవించి కుప్పంకు రెవెన్యూ డివిజన్ హోదా కల్పించినట్లు సీఎం జగన్ తెలపడం గమనార్హం. కుప్పం ఎమ్మెల్యే (చంద్రబాబు నాయుడు) చేసిన విజ్ఞప్తి మేరకు కుప్పాన్ని కొత్తగా 21 రెవెన్యూ డివిజన్ల జాబితాలో చేర్చామని తెలిపారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కుప్పం రెవెన్యూ డివిజన్ చేయడంలో విఫలమయ్యారని జగన్ ఆరోపిస్తున్నారు. కొత్తగా 21 రెవెన్యూ డివిజన్లను చేర్చడంతో ప్రస్తుతం ఆ సంఖ్య మొత్తం 51 నుంచి 72కి చేరింది. ప్రజల నుంచి వచ్చిన 17,500 ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని, కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రజల మనోభావాలు సహా అనేక అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని ముఖ్యమంత్రి చెబుతున్నారు. అయితే ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిందని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వకుండా, పాలకులు తమ సొంత అవగాహనకు అనుగుణంగా ముందుకు సాగారని, పునర్వ్యవస్థీకరణ విఫలమైందని ఆయన భావిస్తున్నారు.
ప్రజల ఆకాంక్షలు, కొత్త జిల్లాల దూరం తదితర సమస్యలను ప్రభుత్వం ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని బాబు, పవన్ నిలదీస్తున్నారు. అదే విధంగా జిల్లాల కోసం చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌లపై సరైన అధ్యయనం కూడా జరగలేదు. పాడేరు కేంద్రంగా ఏర్పాటైన జిల్లాలో ముంపు మండలాల గిరిజనులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎటపాక, కుకునూరు మండలాల ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగించాలి జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి కనీసం 300 కి.మీ. ప్రయాణం చేయాలి. రాయలసీమ ప్రజల అభిప్రాయం కూడా పట్టించుకోలేదన్నారు. మదనపల్లి, హిందూపురం, మార్కాపురం ప్రధాన కేంద్రాలుగా జిల్లాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ఉన్నాయి.
ప్రజలు, పార్టీలు, ప్రజాసంఘాల నుంచి అభిప్రాయాలు తీసుకోలేదని, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసే ముందు ఎలాంటి చర్చ జరగలేదని, ప్రజలు ఇచ్చిన మెమోరాండాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదని ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ఆరోపణలు. పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో లొసుగులు, కలిగిన అసౌకర్యానికి వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన నిరసనలకు జనసేన మద్దతు ఉంటుందని పవన్ ప్రకటించారు. తప్పులను సరిదిద్దే బాధ్యతను పార్టీ తీసుకుంటుందని, ప్రజల సౌకర్యార్థం జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుందన్నారు. దాదాపు ఇదే వాయిస్ ను చంద్రబాబు వినిపిస్తున్నారు. ఆ రెండు పార్టీలు ఇప్పుడు జిల్లాల విభజన జరిగిన తీరుపై పోరాటం చేయడానికి సిద్ధం అవుతున్నాయి. అంతేకాదు, జిల్లాల రూపురేఖల్ని అధికారంలోకి వచ్చిన తరువాత మార్చేస్తామని వెల్లడించారు. దీంతో ఎన్నికల ఎజెండాగా జిల్లాల పునర్విభజన అంశాన్ని టీడీపీ, జనసేన తీసుకెళ్లనున్నాయి. ఎంత వరకు ఆ రెండు పార్టీల అస్త్రం పనిచేస్తుందో చూడాలి.