Convoy Accident : ఏపీలో కేంద్ర మంత్రుల కాన్వాయ్‌కు ప్రమాదం
Convoy Accident : విశాఖపట్నంలోని షీలానగర్ వద్ద మంత్రుల కాన్వాయ్‌లోని మూడు వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి
- By Sudheer Published Date - 02:53 PM, Thu - 30 January 25

ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రులు కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కాన్వాయ్ అనుకోని ప్రమాదానికి గురైంది. విశాఖపట్నంలోని షీలానగర్ వద్ద మంత్రుల కాన్వాయ్‌లోని మూడు వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కారు ప్రమాదంలో తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఘటన అనంతరం మంత్రుల కాన్వాయ్ విశాఖ స్టీల్ ప్లాంట్ వైపు ప్రయాణం కొనసాగాయి.
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం :
కేంద్ర మంత్రులు రాష్ట్ర పర్యటనలో భాగంగా విశాఖ ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్నప్పుడు, ఏపీ అధికార కూటమి నేతలు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్టీల్ ప్లాంట్ కు బయల్దేరిన మంత్రుల కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. రోడ్డు మీద అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న వాహనాలు అదుపు తప్పి ఒకదానికొకటి ఢీ కొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడం తో అందరు హమ్మయ్య అనుకున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం భారీ ప్యాకేజీ :
ఆర్థికంగా నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్రం రూ. 11,440 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రకటించారు. అయితే, ప్లాంట్ ప్రైవేటీకరణపై వచ్చిన ప్రచారం కారణంగా కార్మికుల్లో ఇంకా సందేహాలు కొనసాగుతున్నాయి. ఈ అపోహలను తొలగించేందుకు కేంద్ర మంత్రులు కార్మిక సంఘాలతో చర్చలు జరిపేందుకు వచ్చారు.
ప్లాంట్ భవిష్యత్తుపై చర్చలు :
కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రకారం, స్టీల్ ప్లాంట్‌కు రూ. 35 వేల కోట్లు తక్షణమే ప్రకటించడం సాధ్యపడదని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి కేంద్రం ప్రకటించిన రూ. 11,440 కోట్ల నిధులతో ప్లాంట్‌ను తిరిగి నిలబెట్టే ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు నాటికి మూడు బ్లాస్ట్ ఫర్నేసులు పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభిస్తే, ప్లాంట్ నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపారు.
సెయిల్‌లో విలీనం అంశం :
స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలనే ప్రతిపాదనపై కూడా కేంద్ర మంత్రులు సమీక్షించారు. భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రకారం, సెయిల్ ప్రభుత్వ సంస్థే అయినా, పబ్లిక్ రంగ సంస్థ కావడంతో ఈ ప్రక్రియ మరింత సమర్థంగా అమలవుతుందని చెప్పారు. ప్లాంట్ నిర్వహణ మెరుగుపరిచిన తర్వాత, కేంద్రం సెయిల్ విలీనం అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని తెలియజేశారు.
కేంద్రం మరింత సహాయం అందించనుందా..?
ప్రస్తుతం ప్రకటించిన ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్ పరిస్థితిని మెరుగుపరిచిన అనంతరం, కేంద్ర ప్రభుత్వం మరోసారి అదనపు ఆర్థిక సహాయం అందించనుందని భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ప్లాంట్‌ను పూర్తిగా పునరుద్ధరించేందుకు కేంద్రం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటుందనీ, కార్మికుల హక్కులకు ఎలాంటి అన్యాయం జరగదని హామీ ఇచ్చారు.