TTD Chairman: అటవీ అధికారుల సూచన మేరకే కర్రలు ఇచ్చాం, ట్రోల్స్ పై టీటీడీ చైర్మన్ రియాక్షన్
కర్రలు ఇచ్చి TTD బాధ్యతలను తప్పించుకుంటుందని ట్రోల్స్ చేయడం సమంజసం కాదన్నారు.
- By Balu J Published Date - 12:34 PM, Thu - 17 August 23

తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కిన ప్రదేశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. అలిపిరి నడక మార్గంలో భక్తులకు కర్రల పంపిణీపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌ను ఛైర్మన్ భూమన ఖండించారు. అటవీశాఖ అధికారుల సూచన మేరకే కర్రలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. కర్రలు ఇచ్చి #TTD బాధ్యతలను తప్పించుకుంటుందని ట్రోల్స్ చేయడం సమంజసం కాదన్నారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తామని, మరిన్ని చిరుతలు బంధించేలా కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు.
తిరుమలకు వెళ్లే దారిలో ఓ పాపను చిరుత లాక్కెళ్లి చంపేసిన ఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే. చిన్నారి లక్షిత క్షణాల్లో చిరుత దాడికి బలైంది. చిన్నారిపై దాడి చేసిన చిరుతను సంబంధిత అధికారులు పట్టుకున్నారు. తాజాగా అదే దారిలో మరో చిరుత సంచరించింది. బుధవారం అర్ధరాత్రి ఆ చిరుతను కూడా పట్టుకున్నారు. ఆరేళ్ల లక్షిత మృతి చెందిన తర్వాత పట్టుకున్న చిరుత ఇది రెండోది కాగా, 50 రోజుల్లో ఆ దారిలో మూడు చిరుతలు పట్టుబడ్డాయి. అటవీశాఖ అధికారులు దారి ఇరువైపులా కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల్లో చిరుతపులి కదలికలను గుర్తించారు.
బుధవారం అర్ధరాత్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలోని బోనులో చిరుతపులి చిక్కుకుపోయినట్లు సిబ్బంది గుర్తించారు. చిక్కుకున్న చిరుత గాయపడడంతో చికిత్స నిమిత్తం ఎస్వీ జూకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. శేషాచలం అడవుల్లో 40కి పైగా చిరుతలు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు అంచనా వేశారు. వీటిలో దాదాపు పది చిరుతలు గుడికి వెళ్లే మెట్ల దగ్గరకు వస్తున్నాయి. దీంతో మెట్ల దారికి ఇరువైపులా కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుతపులి కదలికలను గుర్తించేందుకు దాదాపు 500 కెమెరాలు అమర్చారు.
Also Read: Gang Rape: పెద్దపల్లి జిల్లాలో గ్యాంగ్ రేప్, మైనర్ బాలిక మృతి