Ganesh Shobhayatra : గణేశ్ శోభాయాత్రలో విషాదాలు.. ఏకంగా 6 మంది మృతి
Ganesh Shobhayatra : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం చింతలవీధిలో కూడా గణేశ్ శోభాయాత్రలో దుర్ఘటన చోటుచేసుకుంది. స్కార్పియో వాహనం మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతో భక్తులపైకి దూసుకెళ్లింది.
- By Sudheer Published Date - 11:37 AM, Wed - 3 September 25

ఆంధ్రప్రదేశ్‌లో గణేశ్ శోభాయాత్ర (Ganesh Shobhayatra) సందర్భంగా పలు చోట్ల దుర్ఘటనలు చోటుచేసుకుని విషాద వాతావరణం నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్ల గ్రామంలో ట్రాక్టర్ అదుపు తప్పి భక్తులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో దినేష్ (10), నరసింహమూర్తి (32), మురళి (33), సూర్యనారాయణ (52) అనే నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇక అదే జిల్లాలోని మొగల్తూరు మండలంలో మరో ఘోర ప్రమాదం జరిగింది. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఊరేగింపులో పాల్గొన్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి ఐదుగురిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఈవన సూర్యనారాయణ (58), గురుజు మురళి (38), తిరుమల నరసింహమూర్తి (35), కడియం దినేష్ అనే నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ట్రాక్టర్ డ్రైవర్ నీళ్లు తాగడానికి కిందకు దిగిన సమయంలో వాహనంలో ఉన్న చిన్నారి అప్రమత్తత లేకుండా ఇంజన్ ఆన్ చేయడంతో ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి విచారం వ్యక్తం చేస్తూ ఆసుపత్రిలో క్షతగాత్రునికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం చింతలవీధిలో కూడా గణేశ్ శోభాయాత్రలో దుర్ఘటన చోటుచేసుకుంది. స్కార్పియో వాహనం మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతో భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని పాడేరు ఆసుపత్రికి తరలించారు. స్థానికులు డ్రైవర్‌ను పట్టుకుని చితకబాదిన అనంతరం పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం అతను కస్టడీలో ఉండగా, కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వరుస ప్రమాదాలతో గణేశ్ శోభాయాత్రలో ఆనందం కన్నీటిలో కలిసిపోయింది.