Gorantla Butchaiah Chowdary : ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏపై ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడి
గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ చంద్రశేఖర్ పై ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడి చేయడం వివాదానికి తెరలేపింది
- By Sudheer Published Date - 12:00 PM, Fri - 17 November 23

రాజమండ్రి లో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ చంద్రశేఖర్ పై ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడి చేయడం వివాదానికి తెరలేపింది. రాజమండ్రికి చెందిన గోలుకొండ చంద్రశేఖర్ (Golukonda Chandrasekhar).. గోరంట్ల బుచ్చయ్య చౌదరి వద్ద పీఏగా పని చేస్తున్నారు.
ఈ క్రమంలో గురువారం రాత్రి బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary) ఇంటికి వెళ్తుండగా, ట్రాఫిక్ కానిస్టేబుల్ కరుణ్ బాబు (Traffic Constable Karunbabu) చంద్రశేఖర్ ను అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారని అడుగగా.. కానిస్టేబుల్ సీరియస్ అయ్యాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరగ్గా, చంద్రశేఖర్ బైక్ తాళం తీసుకున్న కానిస్టేబుల్ సెల్ ఫోన్ లో బండి నెంబరును ఫోటో తీశాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్ సెల్ ఫోన్ ను చంద్రశేఖర్ లాక్కొనేందుకు యత్నించగా అది రోడ్డుపై పడింది. దీంతో ఆగ్రహించిన కానిస్టేబుల్ తన చేతిలో ఉన్న వాకీటాకీతో చంద్రశేఖర్ పై దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆయన తల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. తాను నిబంధనలు పాటించినా కానిస్టేబుల్ దాడికి పాల్పడ్డాడని బాధితుడు ఆరోపిస్తూ నిరసనకు దిగాడు.
We’re now on WhatsApp. Click to Join.
పీఏ ఫై దాడి విషయం తెల్సుకున్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘటనా స్థలానికి వెళ్లి తన పీఏకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు. ఇదే క్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి తూ.గో జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, టీడీపీ కార్యకర్తలు సైతం అక్కడికి వెళ్లి కానిస్టేబుల్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అయితే కూడలి వద్ద సిగ్నల్ పడినా ఆగకుండా చంద్రశేఖర్ రివర్స్ దిశలో వస్తుంటే తమ కానిస్టేబుల్ అడ్డుకుని ఫొటో తీశాడని, ఈ నేపథ్యంలో అతడు ఫోను లాక్కుని నేలకేసి కొట్టడంతో కానిస్టేబుల్ దాడి చేశాడని డీఎస్పీలు విజయ్‌పాల్, వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే తో మాట్లాడిన పోలీస్ అధికారులు దీనిపై కేసు నమోదు చేసి విచారిస్తామని చెప్పి…చంద్రశేఖర్ ను హాస్పటల్ కు తరలించారు.
ఇక ఈ ఘటన ఫై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. పీఏ చంద్రశేఖర్‌పై ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడి చేయడాన్ని ఖండిస్తున్నాని , పూర్తి విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Also : Hyderabad: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన 5 కార్పొరేటర్లు