Chandrababu : కేంద్రం వద్ద చంద్రబాబు ప్రస్తావించిన అంశాలు ఇవే !!
Chandrababu : ఈ సందర్భంగా రాష్ట్ర విభజనకు పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో అమరావతిని అధికారిక రాజధానిగా పునర్విభజన చట్టంలో చేర్చాలని కోరారు
- Author : Sudheer
Date : 24-05-2025 - 8:45 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) ఢిల్లీ పర్యటన(Delhi Tour)లో భాగంగా కేంద్రమంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనకు పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో అమరావతిని అధికారిక రాజధానిగా పునర్విభజన చట్టంలో చేర్చాలని కోరారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అవసరమైన అంశాలపై వివరణాత్మకంగా చర్చించారు. గత ప్రభుత్వ పాలన వల్ల రాష్ట్రం భారీ నష్టాన్ని ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. 2019 నుంచి 2024 మధ్యకాలంలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ఆయన విమర్శించారు.
ఇంధన రంగ అభివృద్ధికి ప్రతిపాదనలు
ఇంధన రంగంలో ‘పీఎం సూర్యఘర్’ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ పథకం కింద 35 లక్షల కుటుంబాలకు సౌర విద్యుత్ అందించాలన్న లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో 10 వేల కుటుంబాలకు విద్యుత్ అందించాలని కోరారు. 72 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా ‘ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ’ను అమలు చేస్తామని తెలిపారు. ఇందుకోసం రూ.28,346 కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు అనుమతి ఇవ్వాలని కేంద్ర ఇంధన శాఖను అభ్యర్థించారు. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తున్నామని వివరించారు.
రక్షణ, నీటి ప్రాజెక్టులపై కీలక ప్రతిపాదనలు
రక్షణ రంగంలో ఏపీకి బలమిచ్చే విధంగా క్లస్టర్ ప్రాజెక్టుల ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించారు. మిసైల్ తయారీ కేంద్రాలు, నేవల్ ఎక్స్‌పర్‌మెంట్ హబ్‌లు, మిలిటరీ డ్రోన్ల తయారీ కేంద్రాలు వంటి వాటి ఏర్పాటుకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాల సమాచారం కేంద్ర రక్షణ మంత్రికి అందజేశారు. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని, దీనికి రూ.80 వేల కోట్లు అవసరమవుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఆర్థిక సహాయం చేయాలని నిర్మలా సీతారామన్‌ను కోరినట్లు వివరించారు.