Chandrababu : హైదరాబాద్ను తీర్చిదిద్దిన ఘనత మాదే – సీఎం చంద్రబాబు
Chandrababu : 2027కి బులెట్ రైలు సైతం అమరావతి-హైదరాబాద్-చెన్నై-బెంగుళూరు మీదుగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. 5 ఏళ్లూ నిర్మాణ పనులు జాప్యం వల్ల అమరావతిపై 7 వేల కోట్ల అదనపు భారం పడనుందని వాపోయారు
- By Sudheer Published Date - 04:57 PM, Sat - 19 October 24

సికింద్రాబాద్, హైదరాబాద్ నగరాలను నిజాం, బ్రిటిష్ వాళ్లు అభివృద్ధి చేస్తే తాను మూడో నగరం సైబరాబాద్ (Cyberabad) ను తీర్చిదిద్దానని సీఎం చంద్రబాబు (CM Chandrababu) తెలిపారు. శనివారం అమరావతి రాజధాని నిర్మాణ పనులను (Amaravati capital construction works) సీఎం చంద్రబాబు పునఃప్రారంభించారు. ఏపీ సీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ పనులను తిరిగి ప్రారంభించడం ద్వారా రాజధాని పనులను ప్రభుత్వం మొదలు పెట్టింది. తుళ్లూరు మండలం లింగాయపాలెం-ఉద్దండరాయినిపాలెం వద్ద పనులను సీఎం ప్రారంభించారు.
ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గ్రీన్ ఎనర్జీ హబ్‌గా అమరావతి రూపొందనుందని చంద్రబాబు పేర్కొన్నారు. 2027కి బులెట్ రైలు సైతం అమరావతి-హైదరాబాద్-చెన్నై-బెంగుళూరు మీదుగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. 5 ఏళ్లూ నిర్మాణ పనులు జాప్యం వల్ల అమరావతిపై 7 వేల కోట్ల అదనపు భారం పడనుందని వాపోయారు. అనుకున్న లక్ష్యం అనుకున్న సమయానికి జెట్ స్పీడ్‌లో పూర్తి చేయాలని మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ భాస్కర్లను ఆదేశించారు. ఇక దేశంలోనే నంబర్-1 సిటీగా హైదరాబాద్ ను మార్చమని గుర్తు చేస్తూ, అప్పట్లోనే 8 లేన్ల రోడ్లకు రూపకల్పన చేస్తే అందరూ ఆశ్చర్య పోయారని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో అందరూ ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు అమరావతిని కూడా గొప్పగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తన పాలనా కాలంలో హైదరాబాద్ను అభివృద్ధి చేయడంలో తీసుకున్న నిర్ణయాలను ఈ సందర్బంగా వివరించారు. ఐటీ విభాగంలో ముందడుగు వేయించడానికి కీలకమైన హైటెక్ సిటీ, ఐటీ కారిడార్ వంటి ప్రాజెక్టులను ప్రారంభించడంలో తన పాత్రను గుర్తు చేసుకున్నారు. సైబరాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా, దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ హబ్‌లలో ఒకటిగా హైదరాబాద్ను మార్చినట్టు తెలిపారు. 8 లేన్ రోడ్లతో కూడిన భారీ మౌలిక వనరుల రూపకల్పన చేయడం, అంతర్జాతీయ స్థాయిలో పటిష్ఠమైన మౌలిక సదుపాయాలను అందించడం వంటి నిర్ణయాలను తీసుకున్నప్పుడు, చాలామంది ఆశ్చర్యపోయారని , హైదరాబాద్ను ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే నగరంగా మార్చినందుకు గర్వంగా ఉందని తెలిపారు.
ఇక ఇప్పుడు, రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన సవాళ్లను కూడా ప్రస్తావిస్తూ, అమరావతిని పటిష్ఠంగా అభివృద్ధి చేయడమే తన తదుపరి లక్ష్యమని చెప్పారు. విభజన సమయంలో ప్రజలు ఎదుర్కొన్న ఆర్థిక, సామాజిక ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అమరావతిని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
Read Also : CM Revanth : జీవో 29పై చర్చకు రావాలని బండి సంజయ్ కి సీఎం ఆహ్వానం