Terrorist : ధర్మవరంలో ఉగ్రవాది అరెస్ట్
Terrorist : ధర్మవరంలోని కోట కాలనీకి చెందిన నూర్ (Noor ) అనే వ్యక్తి ఒక హోటల్‌లో వంటవాడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ఎన్‌ఐఏ అనుమానిస్తోంది.
- By Sudheer Published Date - 12:55 PM, Sat - 16 August 25

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో ఒక అనుమానిత వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేగింది. ధర్మవరంలోని కోట కాలనీకి చెందిన నూర్ (Noor ) అనే వ్యక్తి ఒక హోటల్‌లో వంటవాడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. ఈ క్రమంలో, అధికారులు నూర్ నివాసంలో సోదాలు నిర్వహించి, 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సిమ్ కార్డుల ద్వారా నూర్ ఎవరెవరితో సంప్రదింపులు జరిపాడనే దానిపై ఎన్‌ఐఏ అధికారులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.
B2 Bombers: పుతిన్‌పై నుంచి దూసుకెళ్లిన బీ-2 బాంబర్లు.. భేటీ సమయంలో ట్రంప్ ‘పవర్ ప్లే’
గత కొంతకాలంగా నూర్ కదలికలపై నిఘా ఉంచిన ఎన్‌ఐఏ, పక్కా సమాచారంతోనే అతన్ని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. నూర్ పాకిస్తాన్‌కు ఫోన్ కాల్స్ చేసి, అక్కడి తీవ్రవాదులతో చాటింగ్ చేస్తున్నాడని సమాచారం. నూర్ మహమ్మద్‌ను అదుపులోకి తీసుకున్న ఐబీ పోలీసులు అతన్ని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. అంతకుముందు కూడా, ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఉగ్రవాద సానుభూతిపరుడు సిరాజ్ ఉర్ రెహ్మాన్‌ను, అలాగే అన్నమయ్య జిల్లా రాయచోటిలో అబూబకర్ సిద్ధికి, మహమ్మద్ అలీలను పోలీసులు అరెస్టు చేసి ఉగ్ర కుట్రలను భగ్నం చేశారు.
Drugs : మొయినాబాద్ ఫామ్ హౌస్ లో భారీగా దొరికిన డ్రగ్స్..సినిమా ప్రముఖులకు కొత్త చిక్కు
ఇటీవల భారత్ పాకిస్తాన్‌పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉగ్ర కదలికలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఆయన చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు లేఖలు రాసి, అన్ని జిల్లాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీ సత్య సాయి జిల్లాలో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న నూర్ పట్టుబడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అరెస్టుతో ఏపీలో ఉగ్రవాద కదలికలపై నిఘా మరింత కఠినతరం అయ్యే అవకాశం ఉంది.