Temperature : ఈ సమ్మర్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు జాగ్రత్త – వాతావరణ కేంద్రం హెచ్చరిక
Temperature : ఈ మూడు నెలలు ముఖ్యంగా ఏప్రిల్, మేలో వడగాలులు తీవ్రంగా ఉంటాయని, ప్రజలు ఎండల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది
- By Sudheer Published Date - 04:12 PM, Sun - 2 March 25

ఈ ఏడాది వేసవి మరింత వేడిగా (Temperature ) ఉండబోతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండలు దంచికొడుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురివుతున్నారు. ఇక మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మూడు నెలలు ముఖ్యంగా ఏప్రిల్, మేలో వడగాలులు తీవ్రంగా ఉంటాయని, ప్రజలు ఎండల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. గత ఏడాదికంటే ఈ వేసవి మరింత వేడిగా ఉండే అవకాశముందని, కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు 46 నుంచి 48 డిగ్రీల వరకు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
నిప్పుల కొలిమిగా మారనున్న నగరాలు
గత కొన్ని సంవత్సరాలుగా వేసవి తీవ్రత పెరుగుతూనే ఉంది. గతంలో మాదిరిగా కేవలం ఫ్యాన్ లేదా కూలర్‌తో చల్లదనం పొందడం కష్టమవుతోంది. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ఉక్కపోత ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఎయిర్ కండీషనర్లు (ఏసీ) ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సైతం పెరగడంతో, రాత్రిళ్లు కూడా ప్రజలు అసౌకర్యాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉంది. గాలిలో తేమ శాతం తగ్గిపోవడం, ఓజోన్ పొర మరింత విచ్ఛిన్నం కావడం ఈ ఉష్ణోగ్రత పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.
ఏపీ, తెలంగాణలో ఎండల తీవ్రత అధికం
ఈసారి ఏపీ, తెలంగాణలో ఎండలు మరింత భీకరంగా ఉండే అవకాశముంది. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 36-37 డిగ్రీల వరకు ఉంటుందని, నగరవాసులు ఎండల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా, ఏపీలో తీరప్రాంత ప్రాంతాల్లో ఉక్కపోత అధికంగా ఉండే అవకాశం ఉంది. గుంటూరు, పల్నాడు, కృష్ణ, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు
వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలో తిరగకుండా ఉండాలి. ఎక్కువ నీటిని తాగడం, చల్లని ఆహార పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వడదెబ్బ సమస్య తలెత్తకుండా నిమ్మరసం, కొబ్బరి నీరు, బటర్ మిల్క్ వంటి ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాలి. బయటికి వెళ్లే సమయంలో తల, చెయ్యులు కప్పుకునేలా స్కార్ఫ్ లేదా కులాయిని ఉపయోగించడం మంచిది. పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఈ ఎండల ప్రభావానికి గురికాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ, వైద్య శాఖల సూచనలను పాటించడం ద్వారా వేడిగాలుల ప్రభావం నుంచి రక్షణ పొందవచ్చు.
Web Series : ఏపీ రాజకీయాలపై వెబ్ సిరీస్.. డైరెక్టర్ ఎవరంటే..!